Bio Reactor | లండన్, ఏప్రిల్ 23: అంతరిక్షంలో ఆహారాన్ని పండించటంపై ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) తాజాగా ఓ విప్లవాత్మక ప్రాజెక్ట్‌ను చేపట్టింది. ల్యాబ్‌లో ఆహార తయారీకి వినియోగించే బయో-రియాక్టర్‌కు సంబంధించి కాంపాక్ట్ వెర్షన్‌ను ఈఎస్ఏ పరిశోధకులు బృందం మంగళవారం అంతరిక్షంలోకి పంపింది.
ఈ మిషన్ సక్సెస్ అయితే, వచ్చే ఏడాది అంతరిక్షంలోకి పెద్ద ఎత్తున బయో రియాక్టర్లను ప్రవేశపెట్టడానికి మార్గం సుగమం అవుతుంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం వద్ద ఆహార ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు ఇది తొలి అడుగుగా ఈఎస్ఏ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంతరిక్షంలో ప్రస్తుతం ఒక వ్యోమగామికి ఒక రోజు ఆహారానికి అయ్యే ఖర్చు అక్షరాలా రూ.23 లక్షలు. మానవుడు అంతరిక్షంలోనే ఆహారాన్ని ఉత్పత్తి చేసుకోగలిగితే, అంతరిక్ష యాత్రల్లో విప్లవాత్మక మార్పులకు దారితీస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.