Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై దాడులు జరగడం ఇదే తొలిసారి కాదు. ఆయనపై గతంలోనూ పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. ఆయనపై 2016లో తొలి దాడి జరిగినప్పటి నుంచి మృత్యువుగా నీడలా వెంటాడుతూనే ఉంది. అయితే దాడి జరిగిన ప్రతిసారీ ట్రంప్ సురక్షితంగా బయటపడుతూ వస్తున్నాడు. 2016 నుంచి ఇప్పటివరకు గత దశాబ్ద కాలంలో ట్రంప్‌పై ఐదుసార్లు దాడులు జరిగాయి. ఆ దాడులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా వాషింగ్టన్ డీసీలోని ఓ హోటల్లో జరుగుతున్న వైట్‌హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ మీట్‌పై కాల్పులు జరిగాయి. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. భద్రతాసిబ్బంది హుటాహుటిన ట్రంప్‌ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. కాల్పులు జరిపిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కాల్పులకు బాధ్యులు ఎవరనే విషయం బయటపడే అవకాశం ఉంది. ఇక ఈ దాడికి ముందు కూడా ట్రంప్‌పై నాలుగు సార్లు దాడి జరిగింది. అందులో 2016లో ఒకసారి, 2017లో ఒక్కోసారి, 2024లో రెండు సార్లు దాడులు జరిగాయి.
2016లో ఎన్నికల ప్రచారంలో ఒక వ్యక్తి పోలీసు అధికారి తుపాకీని లాక్కుని ట్రంప్‌ను కాల్చాలని ప్రయత్నించి పట్టుబడ్డాడు. ఆ దాడి నుంచి ట్రంప్ సురక్షితంగా బయటపడ్డాడు. ఇక 2017లో నార్త్ డకోటాలో అధ్యక్షుడి కాన్వాయ్‌ను ఫోర్క్లిఫ్ట్తో ఢీకొట్టి హతమార్చాలని గ్రెగొరీ లీ అనే వ్యక్తి ప్రయత్నించాడు. కానీ ఆ రెండో ప్రయత్నం కూడా విఫలమైంది. ట్రంప్ సేఫ్ అయ్యాడు. 2024లో ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్సు వద్ద ఒక సాయుధ నిందితుడు మాటువేసి ఉండగా సీక్రెట్ సర్వీస్ అడ్డుకుంది. దాంతో మూడో ప్రయత్నం కూడా ఫెయిల్ అయ్యింది.
అదేవిధంగా 2024లో పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవిని తాకుతూ వెళ్ళింది. తృటిలో ఆయనకు ప్రాణాపాయం తప్పింది. తాజా కాల్పుల ఘటన తర్వాత అగ్రరాజ్యం అప్రమత్తమైంది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వెంటనే రంగంలోకి దిగి హోటల్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాల్పులకు పాల్పడిన దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ట్రంప్ లక్ష్యంగానే ఈ దాడి జరిగిందా..? లేక మరేదైనా కోణం ఉందా..? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
అయితే తాజా ఘటన అమెరికా భద్రతా వైఫల్యాలపై మరోసారి చర్చకు దారితీసింది. వరుస దాడులు జరుగుతున్నా ట్రంప్ తన పంథాను మార్చుకోకుండా ప్రజల్లోకి వెళ్తుండటం ఆయన మద్దతుదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.