బీజింగ్, మార్చి 24: అక్రమ మాంసం వ్యాపారుల నుంచి చాకచక్యంగా తప్పించుకున్న ఏడు శునకాలు.. కలిసికట్టుగా 17 కిలోమీటర్లు నడిచి తమ యజమానుల ఇంటికి చేరుకున్నాయి. ఉత్తర చైనాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. చైనాలోని ‘లు’ అనే పౌరుడు జిలిన్ ప్రావిన్స్‌లోని చాంగ్‌చున్ హైవేపై ఈ నెల 16న ఈ కుక్కలన్నీ కలిసికట్టుగా వెళ్తుండగా వీడియోను రికార్డు చేసినట్టు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ పత్రిక తెలిపింది.
‘అవన్నీ చాలా జాగ్రత్తగా రహదారికి ఒక పక్కన నడుస్తూ కన్పించాయి. ఇందులో గాయపడిన ఒక జర్మన్ షెపర్డ్ శునకాన్ని మిగతావి జాగ్రత్తగా పరిరక్షిస్తూ దగ్గరగా నడిచాయి. ఈ గుంపునకు నాయకత్వం వహిస్తున్నట్టు కన్పించిన కార్గీ జాతి శునకం గుంపునకు ముందు నడుస్తూ, తరచూ మిగిలినవి వస్తున్నదీ లేనిదీ జాగ్తత్తగా పరిశీలిస్తూ ఉంది. ఈ దృశ్యం చూస్తుంటే అవి వీధి కుక్కల్లా కన్పించ లేదు. విపత్తులో కలిసికట్టుగా ఉన్న సోదరుల్లా, కష్టమైనా, నష్టమైనా అందరూ కలిసే ఎదుర్కొందాం అన్న దృఢనిశ్చయంతో ఐక్యంగా ముందుకు సాగుతూ కన్పించాయి’ అని ‘లు’ తెలిపారు.