కీవ్: ఉక్రెయిన్‌కు ఆయుధాలు పంపిస్తున్న పశ్చిమ దేశాలకు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ పశ్చిమ దేశాలు ఆయుధ సరఫరాను కొనసాగిస్తే అప్పుడు దాడులు మరింత ఉదృతం అవుతాయని పుతిన్ తన హెచ్చరికలో పేర్కొన్నారు. మరో వైపు బ్రిటన్ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఉక్రెయిన్‌కు లాంగ్ రేంజ్ మిస్సైళ్లను పంపేందుకు సిద్దమైంది. ఉక్రెయిన్‌కు ప్రత్యేకమైన రాకెట్ సిస్టమ్‌ను పంపిస్తున్నట్లు ఇటీవల అమెరికా కూడా వెల్లడించిన విషయం తెలిసిందే.
అయితే ఎం270 మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్‌ను ఉక్రెయిన్‌కు ఇవ్వనున్నట్లు బ్రిటన్ చెప్పింది. ఆ సిస్టమ్‌ను ఎలా వాడాలో ఉక్రెయిన్ సైనికులకు నేర్పనున్నట్లు కూడా ఆ దేశం వెల్లడించింది. రష్యా ఆక్రమణను ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ దళాలకు శిక్షణ తప్పదని బ్రిటన్ రక్షణ మంత్రి బెన్ వాలెస్ తెలిపారు. రష్యా తన వ్యూహాల్ని ఎప్పటికప్పుడు మార్చేస్తుందని, దానికి తగినట్లే ఉక్రెయిన్‌కు ఇవ్వాల్సిన మద్దతు విషయంలోనూ తాము కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వాలెస్ చెప్పారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డోన్బాస్ ప్రాంతంలో ఉన్న ఫ్రంట్‌లైన్ దళాలను కలిశారు. ప్రస్తుతం రష్యా బలగాలు ఈ ప్రాంతంలోనే దాడుల్ని ఉదృతం చేశాయి. లిస్చాన్స్క్, సోలేదార్ పట్టణాల్లో ఆదివారం రాత్రి పర్యటించినట్లు జెలెన్స్కీ తెలిపారు. జపరోజియా ప్రాంతంలో ఉన్న సైనికులతోనూ మాట్లాడినట్లు వెల్లడించారు.