న్యూఢిల్లీ: కోవిడ్‌కు చెందిన BA.3.2 వేరియంట్(BA.3.2 COVID19 Variant) ప్రస్తుతం మళ్లీ విజృంభిస్తున్నది. ఆ వైరస్ వేరియంట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తున్నది. సుమారు 23 దేశాల్లో ఆ వేరియంట్‌కు చెందిన కేసులు నమోదు అయినట్లు అమెరికాకు చెందిన సీడీసీ పేర్కొన్నది. అమెరికాలోనూ భారీగా BA.3.2 వేరియంట్ కేసులు నమోదు అవుతున్నట్లు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొన్నది. BA.3.2 వేరియంట్‌ను సికాడా వేరియంట్‌గా పిలుస్తున్నారు. అయితే చాపకింద నీరులా ఆ వైరస్ వేరియంట్ వ్యాపిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారీ సంఖ్యలో ఆ వేరియంట్ మ్యుటేషన్లకు గురవుతున్నది.
సార్స్ సీవోవీ2కి చెందిన BA.3.2 వేరియంట్‌ను 2024లో తొలుత దక్షిణాఫ్రికాలో గుర్తించారు. జన్యుపరంగా BA.3.2 వేరియంట్‌ను భిన్నంగా అంచనా వేస్తున్నారు. స్పైక్ ప్రోటీన్‌లో సుమారు 75 మ్యుటేషన్లు ఉన్నట్లు గుర్తించారు. మానవ కణాలను చుట్టుకునే వైరస్‌లోని భాగమే స్పైక్ ప్రోటీన్. JN.1 , LP.8.1 వేరియంట్లలో స్పైక్ ప్రోటీన్‌లో కేవలం 40 మ్యుటేషన్లు మాత్రమే జరుగుతున్నట్లు సీడీసీ వెల్లడించింది. BA.3.2 వేరియంట్ సోకిన వారిలో సాధారణ కోవిడ్ లక్షణాలే ఉండనున్నాయి. గొంతు నొప్పి, దగ్గు, తెమడ, నీరసం, తలనొప్పి, జ్వరం లాంటి లక్షణాలు ఉంటాయి.కొందరిలో ఉదర సంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని సీడీసీ చెప్పింది.
అమెరికాలోని సుమారు 25 రాష్ట్రాల్లో BA.3.2 వేరియంట్ కేసుల్ని గుర్తించారు. అమెరికా విమానాశ్రయాల వద్ద అంతర్జాతీయ పర్యాటకుల నుంచి సేకరించిన నాసల్ స్వాబ్ శ్యాంపిళ్లలో ఈ వేరియంట్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. సికాడా స్ట్రెయిన్ వల్ల భారీ మొత్తం మరణాలు ఉండవంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలు కొంత వరకు పనిచేస్తాయని భావిస్తున్నారు.