వాషింగ్టన్: కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) అమెరికాలో వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటివరకు దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అమెరికాలో తొలికేసు నవంబర్ 25న కాలిఫోర్నియాలో నమోదయింది. ఇప్పుడు అది మిన్నెసొటా, న్యూయార్క్, కొలరాడోకు విస్తరించింది. ఆఫ్రికా దేశాల నుంచి కాలిఫోర్నియాకు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్ రాగా, దేశీయంగా తొలి కేసు మిన్నెసొటాలో నమోదయిందని ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.
న్యూయార్క్లో ఇప్పటివరకు ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 67 ఏండ్ల మహిళ కూడా ఉన్నారని, స్వల్ప లక్షణాలతో ఆమె బాధపడుతున్నారని చెప్పారు. ఆమె ఈమధ్యే దక్షిణాఫ్రికా వెళ్లి వచ్చారని తెలిపారు. నవంబర్ 25న ఆమె అమెరికాకు తిరిగి వచ్చారని, గత మంగళవారం ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. ‘వ్యాక్సిన్ తీసుకోండి. బూస్టర్ డోస్ తీసుకోండి. మాస్క్ ధరించండి’ అని న్యూయార్క్ గవర్నర్ క్యాథి హోచుల్ ట్వీట్ చేశారు.
మిన్నెసొటాకు చెందిన వ్యక్తి న్యూయార్క్లో జరిగిన ఓ కాన్ఫరెన్సులో పాల్గొన్నాడని, అతనికి పాజిటివ్ వచ్చిదని చెప్పారు. అయితే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నాడని వెల్లడించారు.