Indian Tectonic Plate | శాన్ఫ్రాన్సిస్కో, జనవరి 17: పైన అంతా ప్రశాంతం.. లోలోపల అంతా సంఘర్షణ; పైన మంచుతో చల్లని వాతావరణం.. లోలోపల భీకర వాతావరణం.. ఇదీ హిమాలయ పర్వత శ్రేణుల పరిస్థితి. హిమాలయాలు అన్న పేరు వినగానే మనసుకు హాయి. కానీ హిమాలయాల అంతర్భాగంలో భారీ యుద్ధమే జరుగుతున్నదట. కారణం ఏమిటంటే.. భారత టెక్టోనిక్ ఫలకలో చీలిక వస్తుండటమే. యురేషియన్ టెక్టోనిక్ ఫలకతో నిత్య సంఘర్షణ ఫలితంగా హిమాలయ పర్వత శ్రేణులు మరింత ఎత్తుకు పెరిగి, ఆ ప్రాంతంలో ఉన్న టిబెట్ రెండు ముక్కలయ్యే అవకాశం ఉన్నది. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ వార్షిక సమావేశంలో భూగర్భశాస్త్ర నిపుణులు భారత టెక్టోనిక్ ఫలక సంఘర్షణ ప్రభావాన్ని వివరించారు.
ఏ క్షణమైనా భారీ భూకంపం?
భారత టెక్టోనిక్ ప్లేట్ ఏటా సుమారు 5 సెంటీమీటర్లు కదులుతున్నది. దీనివల్ల హిమాలయాల వెంబడి ఒత్తిడి ఎక్కువవుతున్నది. అది పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తలు కొన్నేండ్లుగా హెచ్చరిస్తున్నారు. ‘ఏ క్షణమైనా హిమాలయ పర్వత శ్రేణుల్లో భారీ భూకంపం సంభవించే ప్రమాదం పొంచి ఉన్నది’ అని పేర్కొంటున్నారు. టెక్టోనిక్ ప్లేట్ల కదలిక ప్రభావమే హిమాచల్‌ప్రదేశ్, నేపాల్‌లో భూకంప ప్రభావం అని స్పష్టం చేస్తున్నారు.
ఇండియన్ ప్లేట్ ఎలా ఏర్పడిందంటే..
పురాతన ఖండం గోండ్వానాలో ఒక భాగం ఇది. 10 కోట్ల సంవత్సరాల క్రితం ఇతర శకలాల నుంచి భారత టెక్టోనిక్ ఫలక విడిపోయింది. ఉత్తరం వైపు కదులుతూ వచ్చింది. ప్రస్తుతం భారత ఉపఖండం, దక్షిణ చైనా, పశ్చిమ ఇండోనేషియాలో కొంత భాగం వరకు విస్తరించింది. ఇది 5 కోట్ల సంవత్సరాల నుంచి యురేషియన్ ఫలకను ఢీకొంటున్నది. దాని ప్రభావంతోనే హిమాలయ శ్రేణులు ఏర్పడ్డాయి. అయితే, ప్రస్తుతం ఈ ఫలక.. యురేషియన్ ఫలక వైపు ఏటా 5 సెంటీమీటర్ల మేర కదులుతూ, దాన్ని ఢీకొంటున్నది. దాంతో హిమాలయాలు మరింత ఎత్తు పెరిగి టిబెట్ ప్రాంతం రెండుగా విడిపోయే ప్రమాదానికి దారి తీస్తున్నది.