బీజింగ్: గేమింగ్ టైకూన్, బిలియనీర్ లిన్ క్వి హత్య కేసులో.. మాజీ సీఈవో జూ యావోకు చైనా అధికారులు మరణశిక్ష అమలు చేశారు. లిన్‌కు విషం ఇచ్చి చంపినట్లు జూ యావోపై ఆరోపణలు ఉన్నాయి. 3 బాడీ ప్రాబ్లం అనే సైన్స్ ఫిక్షన్ సిరీస్ విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి. అయితే ఆ సమయంలో యోజూ గేమ్స్ వ్యవస్థాపకుడు లిన్‌కు విషం ఇచ్చి.. యావో హత్యకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. యావోను మే 21వ తేదీన ఉరి తీసినట్లు చైనా అధికారుల ద్వారా తెలిసింది.
లిన్ హత్య కేసు చైనావ్యాప్తంగా పెను సంచలనం రేపింది. యోజూ గేమ్స్ సంస్థను స్థాపించిన లిన్.. ఆ తర్వాత గేమింగ్ పరిశ్రమలో దిగ్గజ వ్యక్తిగా మారారు. 2018లో ఓ ప్రాజెక్టు కోసం యావోను నియమించుకున్నారు. త్రీ బాడీ యూనివర్స్ అనే ప్రోగ్రామ్ కోసం యావోకు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్‌తో డీల్ కుదరడంలో యావో కీలక పాత్ర పోషించారు. కానీ లిన్, యావో మధ్య 2020లో సంబంధాలు బలహీనపడ్డాయి. దీంతో యావోను పక్కనపెట్టేశారు.
ఆ అవమానం భరించలేకపోయిన యావో.. లిన్ హత్యకు ప్లాన్ చేశారు. హెల్త్ సప్లిమెంట్లు అని చెప్పి లిన్‌కు న్యూరోటాక్సిన్, మెర్క్యూరీ కలిసిన విషపదార్ధాన్ని ఇచ్చాడు. 2020 డిసెంబర్లో లిన్ ఆస్పత్రిలో చేరారు. 9 రోజుల చికిత్స తర్వాత 39 ఏళ్ల వయసులో ఆయన ప్రాణాలు కోల్పోయారు.