China tragedy : చైనా దేశాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. గత గురువారం నుంచి అక్కడ కుంభవృష్టి కురుస్తున్నది. ఆగ్నేయ ప్రాంతంలో కురుస్తున్న ఈ భారీ వర్షాలకు జనజీవనం విలవిల్లాడుతోంది. హునాన్ ప్రావిన్స్‌లోని హెంగ్యాంగ్ నగర పరిధిలోగల యూలిన్ గ్రామంలో ఓ ఇంటిపై కొండచరియలు విరిగిపడ్డాయి.
దాంతో ఆ ఇంట్లోని 18 మంది కొండచరియల కింద చిక్కుకుపోయారు. దాంతో సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్స్ హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. కొండ చరియలు తొలగించి తీవ్ర గాయాలతో ఉన్న ఆరుగురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మిగతా 12 మంది ప్రాణాలు కోల్పోయారు.
గేమి తుపాను కారణంగా చైనాలో గురువారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తుపాను బలహీన పడినప్పటికీ ఇంకా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పర్వతాల పైనుంచి వస్తున్న నీటి కొండచరియలు విరిగిపడ్డాయని స్థానిక మీడియా తెలిపింది.
కాగా భారీ వర్షాల వల్ల చైనాలోని చాలా ప్రాంతాల్లో మరణాలు నమోదయ్యాయి. భారీ వర్షాలు, ఈదురు గాలుల ధాటికి షాంఘై నగరంలో ఓ భారీ చెట్టు నేలకూలింది. ఈ ఘటనలో ఓ డెలివరీ బాయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. పలుచోట్ల కాలువల్లో గల్లంతై, కరెంటు షాక్ కొట్టి పలువురు మరణించారు.