బీజింగ్: బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్లలో ఒకటైన హెచ్10ఎన్3 చైనాలో తొలిసారి ఓ మనిషికి సోకింది. ఆ దేశంలోని జియాంగ్సు ప్రావిన్స్‌లోని ఝెంజియాంగ్ నగరంలో ఉండే వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు చైనా నేషనల్ హెల్త్ కమిషన్ (ఎన్‌హెచ్‌సీ) మంగళవారం వెల్లడించింది. ఆ వ్యక్తి ఏప్రిల్ 28న జ్వరం, ఇతర లక్షణాలతో హాస్పిటల్లో చేరాడు. ఆ తర్వాత మే 28న అతనికి ఈ బర్డ్ ఫ్లూ స్ట్రెయిన్ సోకినట్లు తేలింది.
అయితే అతనికి ఆ వైరస్ ఎలా సోకిందో మాత్రం ఎన్‌హెచ్‌సీ చెప్పలేదు. బర్డ్‌ఫ్లూ స్ట్రెయిన్లలో చాలా తక్కువ తీవ్రత ఉన్నది ఇదే. ఇది పెద్ద ఎత్తున మనుషులకు సోకే అవకాశాలు చాలా చాలా తక్కువని ఎన్‌హెచ్‌సీ తెలిపింది. ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నదని, త్వరలోనే డిశ్చార్జ్ చేస్తారని చెప్పింది. అతని సన్నిహితులను కూడా పరీక్షించినా ఈ ఫ్లూ ఆనవాళ్లు కనిపించలేదు.
చైనాలో బర్డ్‌ఫ్లూకు చెందిన ఎన్నో స్ట్రెయిన్లు ఉన్నాయి. అత్యంత అరుదుగా ఇందులోని కొన్ని స్ట్రెయిన్లు మనుషులకు సోకుతున్నాయి. ముఖ్యంగా పౌల్ట్రీల్లో పనిచేసే వాళ్లకు ఇది సోకుతోంది. 2016-17లో హెచ్7ఎన్9 వైరస్ సుమారు 300 మందిని పొట్టనబెట్టుకుంది. ఆ తర్వాత ఎక్కడా ఈ వైరస్ మనుషులకు సోకినట్లు తేలలేదు. అంతేకాదు ఈ తాజా హెచ్10ఎన్3 వేరియంట్ కూడా గతంలో ప్రపంచంలో ఏ మనిషికీ సోకలేదని ఎన్‌హెచ్‌సీ స్పష్టం చేసింది.