Imran Khan | పాకిస్థాన్ సుప్రీంకోర్టులో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట లభించింది. అవినీతి నిరోధక సంస్థ నేషనల్ అకౌంటబిలిటీ బ్యూర్ (NAB) కస్టడీలో ఉన్న ఇమ్రాన్‌ను విడుదల చేయాలని ఆదేశించింది. పీటీఐ చైర్మన్‌ను అరెస్టును సవాల్ చేస్తూ ఆ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు పిటిషన్‌పై విచారణ జరిపించిన సుప్రీంకోర్టు గంటలోగా ఇమ్రాన్‌ను సుప్రీంకోర్టులో హాజరుపరచాలని అధికారులను ఆదేశించింది. విచారణ సందర్భంగా షాబాజ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అల్ ఖదీర్ ట్రస్ట్ అక్రమాల కేసులో ఇస్లామాబాద్ హైకోర్టుకు హాజరుకాగా.. కోర్టులోనే పాక్ సైన్యానికి చెందిన రేంజర్లు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
అయితే, ఇమ్రాన్‌ను అరెస్టు చేసిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఇమ్రాన్‌ను అరెస్టు చట్టవిరుద్ధమన్న కోర్టు.. పాక్‌ను జైలుగా మార్చాడన్ని అనుమతించబోమని స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా ఇమ్రాన్ తరఫున న్యాయవాది హమీద్ వాదనలు వినిపించారు. కేసు విచారణ జరుగుతున్న సందర్భంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ మినల్లా కలుగజేసుకుంటూ.. గతంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులను అవమానకర రీతిలో నాబ్ అరెస్టు చేసిందని, దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఇమ్రాన్ ఖాన్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. ఈ సందర్భంగా శుక్రవారం ఇస్లామాబాద్ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.