గాజా, జూలై 20: ఓ శిశువు తల్లిగర్భంలోనే మృత్యువును జయించాడు. యుద్ధం మిగిల్చిన విషాదంలో చిరంజీవిలా జన్మించాడు. ఇజ్రాయెల్ – గాజా యుద్ధంలో జరిగిన అద్భుతం ఇది. సెంట్రల్ గాజాలోని నుసీరత్ శరణార్థ శిబిరంపై ఇజ్రాయెల్ క్షిపణులతో దాడికి పాల్పడింది. ఈ దాడిలో 24 మంది మరణించగా వీరిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఉన్నారు. ఈ కుటుంబంలోనే ఒలా అద్నాన్ హర్బ్ అల్ కుర్ద్ అనే గర్భిణి ఈ దాడిలో తీవ్రంగా గాయపడింది.
ఆమెను అల్ అవ్దా దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది. అయితే, ఆమె గర్భంలోని శిశువు గుండెచప్పుడు అల్ట్రాసౌండ్ ద్వారా వైద్యులు గుర్తించారు. దీంతో వైద్యులు వెంటనే అత్యవసర సిజేరియన్ జరిపి మగబిడ్డను బయటకు తీశారు. శిశువు ఆరోగ్యం కూడా మొదట బాగోలేకపోయినా క్రమంగా కోలుకున్నాడు. ఇజ్రాయెల్ దాడిలో శిశువు తండ్రి కూడా తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నాడు.