Australia PM | సిడ్నీ : ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్ మరోసారి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు. జోడీ హైడన్తో తన ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఆంథోని గురువారం అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు జోడి హైడెన్తో సెల్ఫీ దిగిన ఫోటోను ఆంథోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె అంగీకారం తెలిపింది అంటూ ఆంథోని రాసుకొచ్చారు. మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆంథోనికి అధికార, ప్రతిపక్ష నేతలు శుభాకాంక్షలు తెలిపారు. పదవిలో ఉండగా ఓ ప్రధాని వివాహం చేసుకోవడం ఆస్ట్రేలియాలో ఇదే తొలిసారి.
2020లో మెల్బోర్న్లో జరిగిన బిజినెస్ డిన్నర్లో తొలిసాని జోడీ హైడెన్ను ఆంథోని కలిశారు. అక్కడ ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో గత నాలుగేండ్ల నుంచి వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారు. 2022లో జరిగిన ఫెడరల్ ఎన్నికల సమయంలోనూ హైడెన్తో కలిసి ఆంథోని ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో ప్రధానిగా ఎన్నికైన తర్వాత.. అధికార పర్యటనలకూ ఆమెను వెంట తీసుకెళ్లారు. హైడెన్ ప్రస్తుతం న్యూ సౌత్ వేల్స్ పబ్లిక్ సర్వీస్ అసోసియేషన్లో అధికారిణి.
ఆంథోనికి ఇది రెండో వివాహం. న్యూ సౌత్ వేల్స్ డిప్యూటీ ప్రీమియర్ కార్మెల్ టెబట్ను 2000 ఏడాదిలో పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 23 ఏండ్ల కుమారుడు ఉన్నారు. 19 ఏండ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ 2019లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.