మిషిగన్: అత్యాధునిక టెక్నాలజీతో వస్తున్న గ్యాడ్జెట్స్ మనుషుల ప్రాణాలను ఎలా రక్షిస్తాయో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. ఆపిల్ వాచ్ సమయానికి అప్రమత్తం చేసి ఓ మహిళ ప్రాణాలను కాపాడింది. తనకు హార్ట్ అటాక్ వచ్చిన విషయాన్ని కూడా ఆమె గుర్తించలేకపోయింది. అయితే అదే సమయంలో తన చేతికి ధరించిన ఆపిల్ వాచ్ అలెర్ట్ చేయడంతో వెంటనే హాస్పిటల్‌కు వెళ్లి ప్రాణాలను దక్కించుకుంది.
అసలేం జరిగిందంటే..
అమెరికాలోని మిషిగన్‌కు చెందిన డియానె ఫీన్స్ట్రా అనే మహిళ ఇప్పుడు ప్రాణాలతో బయటపడి ఆపిల్ వాచ్‌కు థ్యాంక్స్ చెబుతోంది. ఈ ఘటన ఏప్రిల్ 22న జరిగింది. ఆ రోజు నేను కొన్ని అడుగులు వేశానో లేదో.. ఆపిల్ వాచ్ ఓ అలెర్ట్ పంపించింది. నా గుండె రేటు నిమిషానికి 169గా ఉందని చూపించింది. ఇది ఆందోళన కలిగించే విషయమేమో అని తెలుసుకోవడానికి నా భర్తకు ఫోన్ చేస్తే.. వెంటనే డాక్టర్‌ను కలవమని చెప్పారు అని ఫీన్స్ట్రా అనే ఆ మహిళ తెలిపింది.
హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత ఈసీజీ తీయగా.. ఆమెకు అప్పటికే హార్ట్ అటాక్ వచ్చినట్లు తేలింది. కానీ దానిని ఆమె గుర్తించలేకపోయింది. సాధారణంగా పురుషులకైతే ఛాతీ చాలా బరువుగా అనిపించి గుండె పోటు వస్తే సులువుగా తెలుస్తుందని, అదే మహిళల విషయంలో గుర్తించదగిన లక్షణాలు కనిపించవని ఆమె చెప్పింది. ఫీన్స్ట్రాకు ఈసీజీ తర్వాత మరిన్ని టెస్టులు నిర్వహించి.. చివరికి ఓ బ్లాకేజ్ ఉన్నట్లు గుర్తించి వెంటనే స్టెంట్ వేశారు.
ఆపిల్ వాచ్.. గతంలోనూ ఇలాగే..
గతంలోనూ ఆపిల్ వాచ్ ఓ 78 ఏళ్ల వృద్ధుడి ప్రాణాలను కాపాడింది. అందులోని ఫాల్ డిటెక్షన్ (కింద పడినప్పుడు గుర్తించేది) సమయానికి అప్రమత్తమవడంతో సదరు వృద్ధుడికి ప్రాణాపాయం తప్పింది. మైక్ యాగర్ అనే ఆ వ్యక్తి కింద పడి స్పృహ కోల్పోయాడు. అయితే ఆయన చేతికి ఉన్న ఆపిల్ వాచ్ వెంటనే గుర్తించి సాయం కోసం 911కు మెసేజ్ చేసింది.
అసలు తనకు సాయం చేయడానికి పోలీసులు ఎలా వచ్చారో మైక్‌కు అర్థం కాలేదు. ఇదే విషయాన్ని అడిగితే.. మీ ఆపిల్ వాచ్ మాకు మెసేజ్ చేసింది అని వాళ్లు చెప్పారు. అలా సమయానికి సాయం అందడంతో ఆ వృద్ధుడు ప్రాణాలతో బయటపడగలిగాడు.