మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఖలిస్థాన్ మద్దతుదారులు వరుసగా ఆలయాల ధ్వంసానికి పాల్పడుతున్నారు. తాజాగ బ్రిస్బేన్ నగరంలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయాన్ని ధ్వంసం చేశారు. ఆలయ ప్రహరి గోడను పాక్షికంగా కూలగొట్టారు. ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.
ఇవాళ ఉదయం కొందరు వ్యక్తులు శ్రీ లక్ష్మీనారాయణ ఆలయాన్ని ధ్వంసం చేశారని, ఈ విషయాన్ని ఆలయ పూజారి, కొందరు భక్తులు తనకు ఫోన్ ద్వారా తెలియజేశారని ఆ ఆలయ అధ్యక్షుడు సతీందర్ శుక్లా చెప్పారు. ఆలయ ప్రహరి గోడను కూలగొట్టారని తెలిపారు. ఘటనపై క్వీన్స్ లాండ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.
కాగా, ఆస్ట్రేలియాలో గత రెండు నెలల వ్యవధిలో ఆలయాలపై దాడి జరగడం ఇది నాలుగోసారి. గత జనవరి 23న మెల్బోర్న్లోని ఆల్బర్ట్ పార్క్ దగ్గర ఉన్న ఇస్కాన్ టెంపుల్ను కొందరు హిందుస్థాన్ ముర్దాబాద్ అని నినదిస్తూ ధ్వంసం చేశారు. జనవరి 16న విక్టోరియాలోని క్యారమ్ డౌన్స్లోగల చారిత్రక శ్రీ శివవిష్ణు ఆలయాన్ని కూడా అదేరీతిలో కూల్చేశారు. ఇక జనవరి 12న మెల్బోర్న్లోని స్వామి నారాయణ్ టెంపుల్ను కూడా సంఘ విద్రోహ శక్తులు ధ్వంసం చేశాయి.