బీజింగ్: చైనాలో వివాహాల సంఖ్య అంతకంతకూ క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో వివాహ ప్రక్రియను సులభతరం చేసేందుకు చైనాలోని స్థానిక అధికారులు ప్రసూతి దవాఖానలు, బ్యాం కులు, నైట్ క్లబ్‌ల వంటి ప్రదేశాలలో వివాహ రిజిస్ట్రేషన్ కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారని ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ వెల్లడించింది. క్విక్సీ పండుగ సందర్భంగా ఈ వినూత్న ప్రయత్నాన్ని షాన్డాంగ్ ప్రావిన్స్‌లోని లింజీ జిల్లాలోని ప్రసూతి, శిశు సంరక్షణ దవాఖాన ప్రాంగణంలో ప్రారంభించారు.
ఇదేవిధంగా టియాంజిన్‌లోని పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ ఆఫ్ చైనా శాఖ గత నెలలో వివాహ నమోదు సేవలను అందించిన మొదటి బ్యాంకుగా నిలిచింది. అలాగే గ్వాంగ్ జౌ బైయున్ అంతర్జాతీయ విమానాశ్రయం తాజాగా వివాహ ధ్రువీకరణ పత్రాలను జారీ చేయడం ప్రారంభించింది. షాంఘైలోని ఒక నైట్ క్లబ్ స్థానిక పౌర అధికారులతో సర్టిఫికేషన్ వేడుకలను నిర్వహించింది. ఇకపై చైనాలోని జంటలు మెట్రో స్టేషన్లు, పబ్లిక్ పార్కులు, చారిత్రక దేవాలయాలలో కూడా వివాహాలు చేసుకోవచ్చు. దేశంలో జనాభా సంక్షోభం తలెత్తుతున్న దృష్ట్యా చైనా ఈ నిర్ణయం తీసుకుంది.