ఫ్లోరిడా: అమెరికా ఎయిర్లైన్స్(American Airlines)కు చోందిన ఓ విమానం ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది. ఆ విమానం కేవలం మూడు నిమిషాల్లోనే సుమారు 15000 ఫీట్ల కిందకు జారింది. నార్త్ కరోలినాలోని చార్లెట్ నుంచి ఫ్లోరిడాలోని గయినిస్విల్లేకు వెళ్తున్న ఫ్లయిట్ 5916లో ఈ ఘటన జరిగింది. విమానంలో పీడన సమస్య రావడంతో.. ఆ విమానం ఒక్కసారిగా కుదేలైంది. దీంతో దాంట్లో ప్యాసింజెర్లు షాక్ అయ్యారు.
విమానం కిందకు జారిన సమయంలో ఏదో కాలిన వాసన వచ్చింది. భారీ శబ్ధం కూడా వినిపించినట్లు ప్రయాణికులు తెలిపారు. ఇక ఆ విమానంలో ఆక్సిజన్ మాస్క్లు వేలాడాయి. పరిస్థితి గందరగోళంగా తయారైంది. అయితే క్యాబిన్ సిబ్బంది చాకచక్యంతో ప్రయాణికులు ప్రాణాలు దక్కించుకున్నారు. ఫ్లయిట్ అవేర్ డేటా ప్రకారం.. ఆ విమానం 11 నిమిషాల్లో 20 వేల ఫీట్ల కిందకు జారింది. 43 నిమిషాల పాటు జర్నీ చేసిన తర్వాత కేవలం ఆరు నిమిషాల్లోనే ఆ విమానం 18,600 ఫీట్ల కిందకు జారింది.