Drone Delivery : డ్రోన్ల ద్వారా అత్యవసర మందులు సరఫరా చేయడం, పంట పొలాలకు ఎరువులు చల్లడం వంటివి చూశాం. ఇప్పుడు పార్శిళ్లను డెలివరీ చేసేందుకు కూడా డ్రోన్లను వాడుతున్నారు. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ డ్రోన్ల ద్వారా పార్శిళ్లను అందజేస్తోంది. అమెరికాలోని రెండు రాష్ట్రాల్లో డ్రోన్ డెలివరీ సేవలను ఈమధ్యే ప్రారంభించింది. క్యాలీఫోర్నియాలోని లాకెఫోర్డ్, టెక్సాస్‌లోని కాలేజి స్టేషన్లో ఈమధ్యే అమెజాన్ ప్రైమ్ ఎయిర్ డ్రోన్ సర్వీస్ ద్వారా పార్శిళ్లను అందజేసింది. ఆర్డర్ చేసిన గంటలోనే వస్తువులు కస్టమర్ల ఇంటికి చేరవేయాలనే ఉద్దేశంతో ఈ సర్వీస్‌ను అమెజాన్ మొదలుపెట్టింది. మా లక్ష్యం ఏంటంటే.. డ్రోన్ల ద్వారా సురక్షితంగా పార్శిళ్లను సరఫరా చేయడం. అందుకని ఈమధ్యే డ్రోన్ డెలివరీ సేవలు ప్రారంభించాం. త్వరలోనే మరింత మందికి డ్రోన్ ద్వారా పార్శిళ్లను అందజేస్తాం అని అమెజాన్ ఎయిర్ ప్రతినిధి నటాలియె బ్యాంకె ఒక ప్రకటనలో తెలిపారు.
అమెజాన్ కంపెనీ ప్రైమ్ ఎయిర్ సర్వీస్‌ను 2022లో ప్రారంభించింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన కస్టమర్లకు డ్రోన్ ట్రాకింగ్ వివరాలు వస్తాయి. దాంతో డ్రోన్ ఎంత దూరంలో ఉంది? ఏ సమయానికి డెలివరీ చేస్తుంది? అనే సమాచారం తెలుసుకోవచ్చు. ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) పార్ట్ 35 కింద పార్సిళ్లను డ్రోన్ల ద్వారా తరలించేందుకు 2020లో అనుమతి ఇచ్చింది.