Tomahawk Missile : పశ్చిమాసియా (West Asia) లో భీకర యుద్ధం సాగుతోంది. ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel) క్షిపణులు (Missiles), డ్రోన్ల (Drones) తో విరుచుకుపడుతుండగా.. ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తున్నది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై యుద్ధం మొదలుపెట్టినప్పటి నుంచి అమెరికా 850 తోమహాక్ క్రూయిజ్ క్షిపణుల (Tomahawk Missiles) ను ప్రయోగించింది. ఈ సంఖ్య అమెరికా రక్షణవర్గాలను కలవరానికి గురిచేస్తున్నది. ఎందుకంటే సగటున అమెరికా ఒక ఏడాదికి కొనుగోలు చేసే క్షిపణుల సంఖ్య వాటికంటే 9 రెట్లు ఎక్కవ ఉందట.
సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ గణాంకాల ప్రకారం.. అమెరికా ఏడాదికి 90 వరకు తోమహాక్ క్షిపణులను కొనుగోలు చేస్తుంటుంది. 2026 ఏడాదికి యూఎస్ నేవీ నుంచి 57 మిస్సైళ్లకే రిక్వెస్ట్ వచ్చిందని యూఎస్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ పత్రాల ద్వారా వెల్లడవుతోంది. ప్రస్తుతం భారీ స్థాయిలో వీటిని వినియోగించడంతో అవి తరిగిపోతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. అయితే ట్రంప్ యంత్రాంగం మాత్రం అలాంటిది ఏమీ లేదని చెబుతోంది. క్షిపణులు తరిగిపోతున్నాయనే వార్తలు అవాస్తవమని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ కరోలిన్ లీవిట్ అన్నారు.
కాగా సుదూర లేక అత్యంత పటిష్ఠమైన లక్ష్యాలను ఛేదించేటప్పుడు అమెరికా తోమహాక్‌లను రంగంలోకి దించుతుంది. ప్రస్తుతం ఇరాన్ లక్ష్యాలపై యూఎస్ వీటిని పదేపదే వాడుతున్నది. వీటిని ఎక్కువగా విధ్వంసక నౌకలు, జలాంతర్గాముల నుంచి ప్రయోగిస్తుంటారు. అత్యంత కచ్చితత్వంతో 1000 మైళ్లకు (1609 కిలోమీటర్లు) పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ మిస్సైల్ ఢీకొడుతుంది. అధునాతన గగనతల రక్షణ వ్యవస్థలను కూడా దాటుకొని దాడి చేస్తుంది. బ్రిటన్ నేవీ సహా అమెరికా మిత్రదేశాల వద్ద కూడా ఇవి ఉన్నాయి.
అమెరికా దగ్గర ప్రస్తుతం 3,100 తోమహాక్ క్షిపణులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వాటి ధర.. వెర్షన్, లాంచ్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా మారుతుంటుంది. ప్రామాణిక వేరియంట్ ధర 2.2 మిలియన్ డాలర్లు (రూ.20 కోట్ల వరకు) ఉండొచ్చని తెలుస్తోంది. నౌకల వంటి మూవింగ్ టార్గెట్లను ఢీకొట్టేందుకు వాడే వెర్షన్ల ధర 4 మిలియన్ల వరకు ఉంటుందని రక్షణరంగ నిపుణులు చెబుతున్నారు. మరికొన్ని 6 మిలియన్ల వరకు ఉంటాయి. ఇవి సుదూర లక్ష్యాలను టార్గెట్ చేసినప్పటికీ వీటి ఖర్చు ఎక్కువ. అయితే ప్రస్తుతం కొత్త క్షిపణులను సమకూర్చుకొనే వేగంతో పోలిస్తే వీటి వినియోగం భారీ స్థాయిలో ఉన్నది.
‘వేలాదిగా తోమహాక్, సుదీర్ఘ శ్రేణి ఆయుధాలను ఇరాన్‌పై ప్రయోగిస్తున్నాం. అలాగే పేట్రియాట్, థాడ్తోపాటు పలు గగతనతల రక్షణ వ్యవస్థలను మోహరిస్తున్నాం. ఈ సంఖ్య తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది’ అని డెమోక్రటిక్ సెనెటర్ జాక్ రీడ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఏడాదికి గరిష్ఠస్థాయిలో 2,330 క్షిపణులను ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. అయితే పెంటగాన్ మాత్రం ప్రతి ఏటా 90 వరకు ఈ క్షిపణులను కొనుగోలు చేస్తున్నది.