దొడోమ : టాంజానియాలోని విమానాశ్రయంలో ప్రయాణికుల విమానం ల్యాండ్ అవుతుండగా.. నదిలో కుప్పకూలిపోయింది. ప్రెసిషన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం బుకోబాలో ల్యాండ్ అవుతుండగా పైలట్ నియంత్రణ కోల్పోగా.. ఎయిర్‌పోర్ట్‌లో సమీపంలోని విక్టోరియా సరసులో విమానం కుప్పకూలింది. విమానం దార్ ఎస్ సలామ్ నుంచి బుకోబా వయా మంవాంజా మీదుగా వెళ్తున్నది.
ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనలో 19 మంది మృత్యువాతపడ్డట్లు తెలుస్తున్నది. మరో 26 మందిని రిలీఫ్ అండ్ రెస్క్యూ సిబ్బంది రక్షించారు.
కగేరా ప్రావిన్స్‌కు చెందిన పోలీసు కమాండర్ విలియం మ్వాంపాఘలే మాట్లాడుతూ.. ఘటనలో గాయపడ్డ వారిని రక్షించామని పేర్కొన్నారు. విమానం దాదాపు వంద మీటర్ల ఎత్తులో ప్రతికూల వాతావరణం కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.