వాషింగ్టన్, మార్చి 29: నేటి టెక్ యుగంలో కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్-ఏఐ) వినియోగం రోజురోజుకూ పెరుగుతున్నది. అయితే ఇది భారీగా ఉద్యోగాల కోతకు దారితీస్తుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా, యూరోపియన్ యూనియన్లో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో మూడింట రెండొంతులు ఏఐ ఆటోమేషన్ ప్రభావానికి గురవుతున్నాయని గోల్డ్మన్ శాక్స్ పరిశోధన వెల్లడించింది. దాదాపు 30 కోట్ల ఉద్యోగాలపై ఏఐ ప్రభావం పడనున్నట్టు తెలిపింది. పరిపాలన విభాగంలో 46 శాతం, న్యాయ విభాగంలో 44 శాతం ఉద్యోగాలకు ఏఐ ప్రత్యామ్నాయంగా మారిందని తెలిపింది. నిర్మాణ రంగం (6 శాతం), నిర్వహణ రంగం(4 శాతం)పై ఏఐ ప్రభావం తక్కువగా ఉందని చెప్పింది. మరోవైపు ఆర్థిక వృద్ధికి ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని పరిశోధన వివరించింది. పదేండ్ల కాలంలో ప్రపంచ వార్షిక స్థూల ఉత్పత్తిని ఏఐ 7 శాతం పెంచగలదని పేర్కొంది.