న్యూఢిల్లీ: కొత్త ప్రపంచ పటం కోసం యూఎన్ అసెంబ్లీలో తీర్మానం(UN Resolution) చేశారు. అయితే ఆ కొత్త మ్యాప్‌లో ఆఫ్రికా ఖండం సైజు పెరగనున్నది. మెర్కేటర్ మ్యాప్‌లో వాస్తవాని కన్నా ఎక్కువ సైజులో కొన్ని ఖండాలు, దేశాలు ఉన్నాయి. ఈక్వేటార్కు దూరంగా ఉన్న గ్రీన్‌ల్యాండ్.. మెర్కేటర్ మ్యాప్‌లో ఆఫ్రికా కన్నా పెద్దగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నిజానికి గ్రీన్‌ల్యాండ్ కన్నా ఆఫ్రికా 14 రెట్లు పెద్దది. ఇక కొత్త వరల్డ్ మ్యాప్‌తో ఆ సైజులో క్లారిటీ రానున్నది. ఉత్తర యూరోప్, ఉత్తర అమెరికాను కూడా పాత మ్యాప్‌లో ఈక్వేటర్ దగ్గర ఉన్న దేశాల కన్నా ఎక్కువ పెద్ద సైజులో చూపించారు. అయితే కొత్త మ్యాప్‌తో ఆ సైజుల్లో మార్పులు జరగనున్నాయి. మ్యాప్ తమకు సమస్య కాదు అని, కానీ ప్రపంచం మమ్మల్ని మ్యాప్‌ల ఆధారంగా అర్థం చేసుకుంటుందని టోగో విదేశాంగ మంత్రి రాబర్ట్ దుస్సే తెలిపారు. మ్యాప్‌ల ద్వారా ఆఫ్రికా సైజు మారదు అని, కానీ ఆఫ్రికా ఖండం గురించి ప్రజల ఆలోచన మారుతుందని కొందరంటున్నారు. మ్యాప్ మార్పు తీర్మానాన్ని ఆఫ్రికా యూనియన్ స్వాగతించింది.
2018లో ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ చేశారు. మెర్కేటర్ మ్యాప్‌లా కాకుండా.. వాస్తవ సైజుకు దగ్గరగా ఖండాల భూభాగాన్ని ఆ మ్యాప్‌లో చూపించాలనుకున్నారు. ఇక ఆఫ్రికా ఎంత పెద్ద సైజులో ఉందో .. ఈక్వల్ ఎర్త్ ప్రొజెక్షన్ ప్రకారం అంతే సైజులో కనిపించనున్నది. మెర్కేటర్ మ్యాప్‌లో పెద్దగా ఉన్న గ్రీన్‌ల్యాండ్ ఇప్పుడు కొత్త మ్యాప్‌తో తన సైజ్‌ను కోల్పోనున్నది. అయితే ఈ అంశాన్ని అమెరికా వివాదంగా మార్చింది. తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసిన అమెరికా.. ఇది సైద్ధాంతిక చర్య అని విమర్శలు చేసింది. మెర్కేటర్ మ్యాప్ బదులుగా కొత్త మ్యాప్‌లను ప్రోత్సహించనున్నట్లు ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి జీన్ నోయల్ బారట్ తెలిపారు. ఇక వివాదాస్పద భూభాగాల అంశంలో మరో ఆందోళన మొదలైంది. ఈక్వెల్ ఎర్త్ మ్యాప్ ప్రకారం ఉక్రెయిన్‌లోని భూభాగాన్ని రష్యా ఆక్రమించినట్లుగా ఉంది. దీంతో ఆ మ్యాప్ విధానాన్ని ఉక్రెయిన్ వ్యతిరేకించింది. ఓటింగ్‌లో ఉక్రెయిన్ పాల్గొనలేదు. తీర్మానానికి యురోపియన్ యూనియన్ మద్దతు ఇచ్చింది. మ్యాప్‌లు మారినా బోర్డర్లు మారవని ఈయూ పేర్కొన్నది.
పర్ఫెక్ట్ మ్యాప్ ఏదీ లేదన్న అభిప్రాయం కూడా వెల్లడైంది. భూమి గుండ్రంగా ఉన్నా.. మ్యాప్‌లు మాత్రం ఫ్లాట్‌గా ఉన్నాయన్నారు. విస్తీర్ణం, ఆకారం, దూరం, డైరెక్షన్ అంశంలో మ్యాప్‌లో మార్పులు ఉండనున్నాయి. అప్పట్లో మెర్కేటర్ మ్యాప్‌ను ప్రత్యేక అవసరాల కోసం క్రియేట్ చేశారు. నేవిగేషన్ ఆ మ్యాప్‌కు బలం. నావికులు ఆ మ్యాప్‌లో ఉన్న స్ట్రెయిట్ లైన్ల ద్వారా ప్రయాణం చేసేవారు. దేశాల, ఖండాల సైజును మాత్రం మ్యాప్‌తో పోల్చలేమన్నారు. యూఎన్ తీర్మానంలో మెర్కేటర్ మ్యాప్‌ను బ్యాన్ చేయలేదు. ప్రభుత్వాలు, స్కూళ్లు, టెక్నాలజీ కంపెనీలు ఆ మ్యాప్‌ను రిప్లేస్ చేయాలని కూడా ఆ తీర్మానంలో కోరలేదు. కేవలం భూమి సైజుతో పోలుస్తూ.. ఈక్వెల్ ఏరియా మ్యాప్‌లను ప్రోత్సహించాలని యూఎన్ భావిస్తున్నది. ఈ ప్రతిపాదనకు భారత్ కూడా మద్దతు తెలిపింది.