హైదరాబాద్: ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేసింది. ఎడాదిన్నరపాటు ఆ వైరస్ కట్టడికి మందులుగానీ, ఎలాంటి వ్యాక్సిన్‌గానీ అందుబాటులో లేకపోవడంతో కేసులు, మరణాలు భారీగా నమోదయ్యాయి. ఎట్టకేలకు ఏడాది క్రితం వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నా మరణాల రేటు బాగా తగ్గిపోయింది.
అందుకే అన్ని దేశాలు వ్యాక్సినేషన్‌ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తొలి డోసు, రెండో డోసు, బూస్టర్ డోసు అంటూ ఒక్కొక్కరు మూడు డోసుల వ్యాక్సిన్ వేసుకునే వరకు ప్రభుత్వాలు వదలడంలేదు. ఇంత జరుగుతున్నా కొందరు మాత్రం వ్యాక్సిన్ వేసుకునేందుకు నిరాకరిస్తున్నారు. అయితే ఇలా వ్యాక్సిన్లను నిరాకరించడంవల్ల ఆస్పత్రుల్లో శస్త్రచికిత్సలు చేయించుకోవాలన్నా, ఇతర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలన్నా సమస్యలు వస్తున్నాయి.
తాజాగా అమెరికాలో అలాంటి ఘటనే జరిగింది. డీజే ఫెర్గూజన్ (31) అనే హార్ట్ పేషెంట్ కరోనా వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరించడంతో బోస్టన్లోని ఓ ఆస్పత్రి వైద్యులు గుండెమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుంటున్న రోగుల జాబితా నుంచి అతని పేరును తొలగించారు. అయితే, ఇష్టానికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ తీసుకొమ్మనడం కరెక్టు కాదని, అతని సెంటిమెంట్‌ను గౌరవించాలని ఫెర్గూజన్ కుటుంబసభ్యులు వాదిస్తున్నారు.
నిబంధనల ప్రకారం వ్యాక్సిన్ తీసుకుంటేనే గుండెమార్పిడి శస్త్రచికిత్స చేస్తామని వైద్యులు, పేషెంట్ సెంటిమెంట్‌ను గౌరవించాలని కుటుంబసభ్యులు ఎవరి వాదనలు వారు వినిపిస్తుండటంతో.. ఫెర్గూజన్ గుండెమార్పిడి కోసం ఇంకా ఎదరుచూడాల్సిన దుస్థితి ఏర్పడింది.