Brazil | భారత్‌లో ఎండలు దంచికొడుతుంటే.. విదేశాల్లో మాత్రం వర్షాలు ముంచెత్తుతున్నాయి. తాజాగా బ్రెజిల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు వరదలు (floods) పోటెత్తాయి. దీంతో అక్కడ జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
ఈ వర్షాలకు రియో గ్రాండ్ డొ సుల్ (Rio Grande do Sul) రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తాయి. దీంతో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటి వరకూ 78 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 105 మంది గల్లంతైనట్లు స్థానిక మీడియా వెల్లడించింది. వరదలకు 155 మందికిపైగా గాయపడినట్లు పేర్కొంది. సుమారుగా లక్ష మందికిపైగా ప్రజలు నిరాశ్రయులైనట్లు తెలిపింది. ఉరుగ్వే, అర్జెంటీనాకు సరిహద్దున ఉన్న రాష్ట్రంలోని దాదాపు 500 నగరాల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ మందిని వరదలు ప్రభావితం చేసినట్లు వెల్లడించింది.
వరదల కారణంగా పలు నగరాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రధాన వంతెనలు ధ్వంసమయ్యాయి. వర్షాల కారణంగా కొన్ని చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. చాలా ప్రాంతాల్లో తాగునీరు, విద్యుత్, సమాచార వ్యవస్థలు స్తంభించిపోయాయి. సుమారు నాలుగు లక్షల మందికిపైగా ప్రజలు అంధకారంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టింది. సైన్యాన్ని కూడా రంగంలోకి దించింది.
Also Read..
Terror Threat | టీ20 ప్రపంచకప్‌కు ఉగ్రముప్పు.. స్పందించిన వెస్టిండీస్ క్రికెట్ బోర్డు
Amethi | అమేథిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి.. కార్లు ధ్వంసం
ED Raids | రాంచీలో ఈడీ దాడులు.. మంత్రి వ్యక్తిగత సహాయకుడి ఇంట్లో కట్టలు కట్టలుగా బయటపడ్డ నగదు