న్యూయార్క్ : అమెరికా నుంచి భారతీయుల తరలింపు కొనసాగుతున్నది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘మిషన్ డిపోర్టేషన్’ మరింత వేగంగా కొనసాగుతుండటంతో ఈ ఆగస్టు మొదటి 15 రోజుల్లోనే ఏకంగా 5,200 మంది భారతీయులను అమెరికా నుంచి స్వదేశానికి పంపించారు. ఇందులో హెచ్-1బీ, ఓ-1 వీసాలు ఉన్న విద్యార్థులు కూడా ఉండటం విశేషం. ఇందులో నైపుణ్యాలున్న నిపుణుల సంఖ్య గణనీయంగా ఉన్నట్టు తెలుస్తున్నది. 2025లో అత్యధికంగా 3,567 మంది భారతీయులను వెనక్కు పంపించేశారు. వారంతా అక్రమ వలసదారులేనని ఐసీఈ వెల్లడించింది. జూన్ నెలలోనే 801 మంది భారతీయుల తొలగింపునకు ఐసీఈ ఆదేశాలు జారీ చేసింది.
కెనాడాలోనూ నిబంధనలు కఠినం..
యూఎస్‌తో పాటు కెనడా కూడా భారతీయులను వెనక్కు పంపేందుకు రెడీ అవుతున్నది. కెనడాలోని అల్బెర్టా ప్రావిన్స్ ప్రభుత్వం పోస్టు గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్‌ను రద్దు చేసింది. దీంతో అక్కడ చదువుకుంటున్న 1,500 మంది విద్యార్థులు ఇబ్బందుల్లో పడ్డారు. వీరంతా చదువుకుంటూనే పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేసే విధానంలో కెనడాలో నివసిస్తున్నారు. ఈ విధానం అక్కడ రద్దు చేయడంతో అక్కడి విద్యార్థులు ప్రభావితం అవుతున్నారు.