Venezuela: వెనెజులాలోని నికోలస్ మదురో (Nicolas Maduro) ప్రభుత్వాన్ని విమర్శించిన ఓ మహిళా డాక్టర్‌కు (Woman Doctor) కోర్టు 30 ఏండ్ల జైలు శిక్ష విధించింది. మార్గీ ఒరోజ్కో (Marggie Orozco) అనే 65 ఏండ్ల మహిళా డాక్టర్ వాట్సప్ ఆడియో మెసేజ్ (WhatsApp Audio Message) ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సందేశం పంపించిందని ఆమెపై కమ్యూనిటీ నాయకులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెకు రాజద్రోహం, విద్వేషాన్ని ప్రేరేపించడం, కుట్రకు పాల్పడిందంటూ కోర్టు జీవిత కాల శిక్ష విధించింది. అయితే ఆమె ఏ సందేశం పంపారు, ఎవరికి పంపారనే విషయం తెలియలేదు.
2024 జూలైలో వెనెజులా (Venezuela) అధ్యక్షుడిగా నికోలస్ మదులో మరోసారి ఎన్నికయ్యారు. అయితే ఎన్నికల కౌంటింగ్‌లో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఫలితాలపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఇందులో భాగంగా డాక్టర్ ఒరోజ్కోను (Marggie Orozco) ఆగస్టు నెలలో శాన్ జువాన్ డి కోలన్ పట్టణంలో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెతోపాటు దేశవ్యాప్తంగా వేలాది మందిని అరెస్టు చేశారు. అయితే చాలా మంది నెలల వ్యవధిలో విడుదలయ్యారు. అయితే ఒరోజ్కో మాత్రం జైలులోనే మగ్గిపోయారు. తాజాగా ఆమెప నమోదైన అభియోగాలను నిర్ధారిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. కాగా, ఒరోజ్కో నిర్బంధంలో ఉండగా ఒరోజ్కోకు రెండు సార్లు గుండెపోటు వచ్చిందని జేఈపీ అనే హక్కుల ఎన్జీవో వెల్లడించింది. దేశంలోని జైళ్లలో సుమారు 882 మంది రాజకీయ ఖైదీలు మగ్గిపోతున్నారని తెలిపింది.