Houthi Attacks : సౌదీ అరేబియాపై హౌతీ ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. సౌదీలోని ఎయిర్‌పోర్టులపై హౌతీలు జరిపిన దాడిలో ముగ్గురు మరణించారు. ఈ విషయాన్ని సౌదీ విమానయాన శాఖ వెల్లడించింది. ప్రస్తుతం యెమెన్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. యెమెన్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని సైన్యానికి సౌదీ అరేబియా మద్దతు ఇస్తుంటే.. తిరుగుబాటుదారులైన హౌతీలకు ఇరాన్ మద్దతు ఇస్తోంది. హౌతీలు సౌదీ టార్గెట్‌గా దాడులు చేస్తున్నారు.
రియాద్ ఎయిర్‌పోర్టుపై జరిపిన మిస్సైల్ దాడుల్లో ఒకరు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. అభా ఎయిర్‌పోర్టు ప్రాంతంపై హౌతీలు జరిపిన మరో దాడిలో ఇద్దరు మరణించగా, 28 మంది గాయపడ్డారు. మంగళవారం, బుధవారంలలో ఈ దాడి జరిగినట్లు సౌదీ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు సౌదీ కూటమి సైన్యం కూడా హౌతీలపై ఎదురుదాడులకు దిగింది. తాము హౌతీలను శిక్షించకుండా వదిలిపెట్టబోమని సౌదీ ప్రకటించింది. సౌదీలోని వైమానిక స్తావరాలే లక్ష్యంగా హౌతీలు దాడి చేస్తున్నారు. బాలిస్టిక్ మిస్సైల్స్‌తోపాటు, భారీ పేలుడు పదార్థాలు కలిగిన డ్రోన్లతో దాడులకు దిగుతున్నారు. ఈ విషయాన్ని హౌతీలు కూడా ధృవీకరించారు.
యెమెన్‌లోని అడెన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై కూడా హౌతీలు దాడి చేశారు. కైరో విమానం రన్‌వేపై ల్యాండ్ అవ్వడానికి కొన్ని నిమిషాల ముందు అక్కడి రన్‌వేపై మిస్సైల్ దాడి జరిగింది. నౌకలు వెళ్లే బాబ్ ఎల్ మందేవ్ సంధి మార్గంలో కూడా దాడి జరిగింది. ఈ మార్గం నౌకా రవాణాకు చాలా కీలకం. ఇరాన్-అమెరికా యుద్ధం ఒక పక్క కొనసాగుతుంటే సౌదీ, యెమెన్ గ్రూపుల మధ్య కూడా మరో యుద్ధం కొనసాగుతోంది.