రియాద్: సౌదీ అరేబియా చమురు సంస్థ ‘ఆరామ్కో’కు చెందిన ఓ హెలికాప్టర్ కుప్పకూలి అందులో ప్రయాణిస్తున్న 14మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం రస్ తనురా అనే ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగినట్టు సౌదీ అరేబియా అధికారిక వార్తా సంస్థ తెలిపింది. హెలికాప్టర్ ప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు. ఘటనపై అక్కడి అధికారులు దర్యాప్తు చేపట్టారు. పశ్చిమాసియా ప్రాంతంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం రాస్ తనురాలోనే ఉంది. దీనిని సౌదీకి చెందిన ఆరామ్కో సంస్థ నిర్వహిస్తున్నది. ఘటనలో మృతిచెందిన వారంతా సౌదీ అరేబియా పౌరులేనని తెలిసింది.
ఫ్రాన్స్ ఈశాన్య ప్రాంతంలోని టోంబ్లెయిన్ నగరానికి సమీపంలో విమానం కుప్పకూలి..11మంది దుర్మరణం చెందారు. ఆదివారం విమానం నాన్సీ-ఎస్సే ఎయిర్ఫీల్డ్ నుంచి బయల్దేరిన కొద్ది నిమిషాల్లో ఈ దుర్ఘటన జరిగినట్టు స్థానిక యంత్రాంగం ‘ఎక్స్’లో తెలిపింది. అధికారులు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారని, విమాన ప్రమాదానికి గల కారణం తెలియరాలేదని పేర్కొన్నది.