యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లాలో రియల్ ఎస్టేట్ మాఫియా ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అమాయక ప్రజలను బురిడీ కొట్టించి వందల కోట్లు కొల్లగొట్టిన ఉదంతాలు బహిర్గతమవుతున్నాయి. అందమైన బ్రోచర్లతో జనాన్ని ఊహల పల్లకిలో విహరింపజేసిన కేటుగాళ్ల బాగోతాలు తేటతెల్లమవుతున్నాయి. పైసాపైసా కూడబెట్టుకొని వాయిదాలు చెల్లించినా.. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా మోసాలకు పాల్పడటంతో బాధిత కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి.
ఈ ఆగడాలకు ఉదాహరణే భువనగిరి సమీపంలోని ఇన్క్రెడిబుల్ ఇండియా వెంచర్. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మాజీ సీఎం కేసీఆర్ పునర్నిర్మించడంతో యాదాద్రి భువనగిరి రియల్ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలు అన్న చందంగా మారింది. యాదగిరిగుట్ట, ఆలేరు, భువనగిరి తదితర మండలాల్లో రియల్ బూమ్ జోరుగా నడించింది. పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి.
పదేండ్ల క్రితం భువనగిరి మండల పరిధిలోని రుస్తాపూర్లోని తండాలో ఇన్క్రెడిబుల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే వెంచర్‌ను ప్రారంభించారు. సుమారు 15000 ప్లాట్లను చేశారు. ఈ క్రమంలో ప్రజలను ఆకట్టుకునేందుకు అందమైన బ్రోచర్లు, ఏజెంట్లు నియమించుకొని రియల్ వ్యాపారం చేశారు. మొదట్లో ఏవేవో మాయామాటలు చెప్పి వందలాది మంది పేద, మధ్య తరగతి జనాలకు అంటగట్టారు. అనేక మంది వాయిదా పద్ధతిలో చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతా బాగానే ఉన్నా.. మొత్తం ఈఎంఐలు చెల్లించాక అసలు సమస్య షురూ అయ్యింది.
వాయిదాలు కట్టినా.. నో రిజిస్ట్రేషన్
మొత్తం వాయిదాలు చెల్లించిన రిజిస్ట్రేషన్ చేయకుండా వెంచర్ నిర్వాహకులు ముఖం చాటేస్తున్నారు. ఏడాది, రెండు సంవత్సరాలు గడుస్తున్నా రిజిస్ట్రేషన్ చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. బాధితుల్లో సైనికులు, మాజీ సైనికులు కూడా ఉండటం విశేషం. వెంచర్ నిర్వాహకుల్లో ఓ మాజీ సైనికుడు కీలకంగా ఉండటంతో మిగతా వారందరిని మెప్పించడానికి సులభతరమైంది. ప్రస్తుతం బాధితులంతా హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లిలో ఉన్న వెంచర్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఏదో ముచ్చట చెబుతూ కాలయాపన చేస్తున్నారు. గట్టిగా నిలదీస్తే ‘ఏం చేసుకుంటారో చేసుకోండి పో’ అని బెదిరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పైగా భూముల రేట్లు పెరిగాయని, అదనంగా డబ్బులు చెల్లిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని బుకాయిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రిజిస్ట్రేషన్ చేసిన పొజిషన్ ఏదీ..
కొందరు మొత్తం డబ్బులు చెల్లించిన రిజిస్ట్రేషన్ చేయకపోవడం ఒక ఎత్తు అయితే.. రిజిస్ట్రేషన్ చేసినా క్షేత్రస్థాయిలో ప్లాట్ చూపించకపోవడం మరో ఎత్తు. ఒక వేళ పేపర్స్ ఉన్నా పొజిషన్లో ప్లాట్ ఉండదు..అసలు ప్లాట్ ఎక్కడుందో కూడా తెలియని దుస్థితి. ఒకే ప్లాట్‌ను ముగ్గురు, నలుగురికి చూపిస్తూ మోసాలకు తెరలేపారు. ఇదిలా ఉంటే.. ఒకే ప్లాట్ ఇద్దరు, ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. అంతటితో ఆగకుండా ఇక్కడ ఒకే సర్వే నంబర్‌తో మూడు లేఅవుట్లు చేశారని బాధితులు వాపోతున్నారు.
దీంతో అసలు ప్లాట్ ఎక్కడుంది..? ఏ ప్లాట్ ఎవరిది..? అనేది తెలియక లబోదిబోమంటున్నారు. ఇక వెంచర్ ప్రారంభంలో ఆకర్షణీయమైన బ్రోచర్లతో జనాన్ని మాయలో పడేసుకున్నారు. హైదరాబాద్‌కు దగ్గరగా ఉందని, యాదరిగుట్ట అభివృద్ధి చెందుతుందని, భవిష్యత్ అంతా ఇక్కడే అని వలలో వేసుకున్నారు. మొదట డెవప్మెంట్ చేస్తునట్లు నమ్మించారు. కానీ తీరా ఇప్పుడు చూస్తే వెంచర్లో అన్నీ రాళ్లు, రప్పలే దర్శనమిస్తున్నాయి. కొన్ని ప్లాట్లలో పెద్ద పెద్ద బండరాళ్లు కనిపిస్తున్నాయి. అన్ని రకాలు అనుమతులు కూడా లేవని బాధితులు చెప్పుకొస్తున్నారు. ఎలాంటి సదుపాయాలు లేవు. ప్రభుత్వ యంత్రాంగం చొరవ తీసుకొని తమకు న్యాయంచేయాలని బాధితులు వేడుకుంటున్నారు.
రిజిస్ట్రేషన్ చేయడం లేదు
నా పేరు రాజిరెడ్డి. హైదరాబాద్‌లోని సైనిక్ పురిలో ఉంటున్నా. ప్రైవేట్ బిజినెస్ చేసున్నా.. 2014లో 150 గజాల ప్లాట్‌ను కొనుగోలు చేశా. 42 నెలలు వాయిదాలు చెల్లించాను. మొత్తం బకాయిలు చెల్లించినా రిజిస్ట్రేషన్ చేయడంలేదు. వెంచర్ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా. ఇదేంటని అడిగితే వింత సమాధాలు చెబుతున్నారు.
-రాజిరెడ్డి,బాధితుడు
న్యాయం చేయండి
2018లో 150 గజాలు తీసుకున్నాం. ప్లాట్ విలువ రూ. 3.75లక్షలు. నెలకు రూ. 8వేల వాయిదా చొప్పున 39 నెలలు చెల్లించా. మొత్తం అమౌంట్ క్లియర్ చేశాం. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.32,500 కూడా కట్టాను. రిజిస్ట్రేషన్ చేయమంటే ఏడాది ఆగమన్నరు. ఇలా రెండేండ్లు జరిపారు. ఇంకా నాలుగు లక్షలు కట్టమంటున్నారు. ప్రభుత్వం న్యాయం చేయాలి.
– నరహరి, రేణికుంట, రాజాపేట