కవాడిగూడ డిసెంబర్ 14: నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ, జాతీయ బ్యాంక్ నాబార్డ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గోల్కొండ హ్యాండీక్రాప్ట్స్, హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్లో హస్తకళాకారులు తయారు చేసిన వివిధ కళారూపాలు కొలువుదీరాయి. ఈ ప్రదర్శన ద్వారా తెలంగాణ హస్తకళలు, చేనేత వస్ర్తాలతో పాటు ఇతర ప్రాంతాల కళాకారులు వారి వారి ఉత్పత్తులను వినియోగదారులు స్వయంగా విక్రయించుకునే విధంగా అవకాశం కల్పించారు. ఈ నెల 18 వరకు జరిగే ఈ హస్తకళల ప్రదర్శనను సంస్థ అధ్యక్షుడు సంపత్‌కుమార్ గుప్తా, కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ సెక్రెటరి, ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్దప్రకాశ్ జ్యోతి(ఐఏఎస్), నాబార్ట్ చీఫ్ జనరల్ మేనేజర్ సుశీల చింతల చేతుల మీదుగా ఈ నెల 9 ప్రారంభించారు.
ఎన్టీఆర్ స్టేడియం (తెలంగాణ కళాభారతి)లో దేశంలోని 150 మంది హస్తకళాకారులు తయారు చేసిన వివిధ రకాల హస్త కళారూపాలను ఈ ఎగ్జిబిషన్లో పలు రకాల వస్తువులను విక్రయదారులకు అందుబాటులో ఉంచారు. డోక్రా కళారూపాలు, చెరియాల్ పేయింటింగ్స్, బిద్రి, నిర్మల్ పెయింటింగ్స్, ఇత్తడి కళాకృతులు, వెదురు కళాకృతులు, నిర్మల్, బొంతపల్లి కలప ఆట వస్తువులు, హ్యాండ్ ఎంబ్రాయిడరీ, టెర్రా కోట కళాకృతులు, ముత్యాలు, ఇమిటేషన్ జ్యూవెల్లరీ, జ్యూట్ వస్తువులు, బ్లూ పోటరి, పోచంపల్లి, సిద్దిపేట, మహదేవపూర్ చీరలు, గద్వాల్, నారాయణ పేట చీరలు, బెంగాల్ కాటన్ చీరలు, కలంకారీ ప్రింట్స్, పెయింటింగ్స్, జరి ఎంబ్రాయిడరీ, కాశ్మీర్ చీరలు, లక్నో చికస్ ఎంబ్రాయిడరీ, భాగల్పూర్ చీరలు, చందేరీ చీరలు, బనారస్ చీరలు, ఇతర హస్తకళలు, టెక్స్టైల్స్ ఈ ఎగ్జిబిషన్లో విక్రయదారులకు అందుబాటులో ఉంచారు. వస్తువులను కొనుగోలు చేసేందుకు నగర నలు మూలల నుంచి నగరవాసులు సందర్శించి తమకు నచ్చిన వస్తువులను విక్రయిస్తున్నారు.
నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో హస్తకళల సంస్థ, నాబర్డ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌కు విక్రయదారులను మంచి గిరాకీ ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో కళాకారులు తయారు చేసిన వస్తువులు అమ్ముడుపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం హస్తకళలను ప్రోత్సహించడం వల్లనే కళాకారులకు మంచి గుర్తింపుతో పాటు వారికి ఉపాధి లభించింది.
-మహ్మద్ మసూద్ అలీ, గన్‌ఫౌండ్రీ షోరూం మేనేజర్ (తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ)