హైదరాబాద్: హెచ్ఐవీ డ్రగ్ కాంబినేషన్ సామర్థ్యం పెంపుపై యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్) పేటెంట్ పొందింది. హెచ్ఐవీ రోగులకు ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ థెరపీ కోసం లాక్టోఫెర్రిన్ నానోపార్టికల్స్‌తో కూడిన హై యాక్టివ్ యాంటీరెట్రోవైరల్ కాంబినేషన్ డ్రగ్‌కు పేటెంట్ లభించింది. స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్‌కు చెందిన బయోటెక్నాలజీ, బయోఇన్ఫర్మేటిక్స్ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఆనంద్ కే కొండపి పర్యవేక్షణలో మాలిక్యులర్ థెరప్యూటిక్స్ కోసం దీనిని ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. హెచ్ఐవీ-1 సోకిన కణాలను చేరుకునే లక్ష్యంగా యాంటీ రెట్రోవైరల్ డ్రగ్ కాంబినేషన్‌ను కనుగొన్నారు. పేటెంట్ పొందిన లాక్టోఫెర్రిన్ నానోపార్టికల్స్‌తో కూడిన డ్రగ్‌ను హెచ్ఐవీ-1 చికిత్సలో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ థెరపీ కోసం వినియోగిస్తారు. నోటి గుళిక ఔషధంగా దీనిని ఉత్పత్తి చేస్తారు.
లాక్టోఫెర్రిన్ రిసెప్టర్ ద్వారా డ్రగ్‌ను హెచ్ఐవీ-1 సోకిన కణాలకు తీసుకెళ్లేలా లాక్టోఫెర్రిన్ పని చేస్తుంది. ఔషధ ఉత్పత్తిలో డ్రగ్ కాంబినేషన్ సహకార లోడింగ్ కారణంగా, హెచ్ఐవీ సోకిన కణాలలోకి మందుల పంపిణీ జరుగుతుంది. తద్వారా ఉద్దేశించిన లక్ష్యాల వద్ద ఏకకాలంలో పనిచేయడం ద్వారా వైరస్ పెరుగుదలను నియంత్రిస్తుంది. తద్వారా డ్రగ్ కాంబినేషన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. దీంతో జీవ కణాలను పెంచడంతోపాటు విషపూరితను తగ్గిస్తుంది.
కాగా, హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ ఇన్ఫెక్షన్ (HIV) టైప్ 1 ఇన్ఫెక్షన్, అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియెన్సీ సిండ్రోమ్ (AIDS) అభివృద్ధితో ముడిపడి ఉందని ప్రొఫెసర్ కొండపి తెలిపారు. వివిధ కాంబినేషన్స్‌తో కూడిన రెట్రోవైరల్ ఔషధాలను అధిక క్రియాశీల యాంటీ రెట్రోవైరల్ థెరపీ (HAART)లో భాగంగా హెచ్ఐవీ చికిత్సలో ఉపయోగిస్తారని చెప్పారు. అయితే ప్రస్తుత HAART విధానంలో పరిమితులున్నాయన్నారు. హెచ్ఐవీ సోకిన కణాలకు ఔషధ సమ్మేళనం సహా పంపిణీ సరిగా జరుగదన్నారు. దీంతో వ్యాధి సోకని, సోకిన కణాలకు డ్రగ్ రవాణా జరుగడం వల్ల తక్కువ సామర్థ్యం, నిరోధకత, విషపూరితం వంటి వాటికి దారితీస్తుందని వివరించారు. లాక్టోఫెర్రిన్ నానోపార్టికల్స్‌తో కూడిన హై యాక్టివ్ యాంటీరెట్రోవైరల్ కాంబినేషన్ డ్రగ్ దీనిని నివారిస్తుందని వెల్లడించారు.