సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ) : రోడ్డు ప్రమాదాల నివారణకు నగర పోలీసులు నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కొరఢా ఝలిపిస్తున్నారు. అయినప్పటికీ ఉల్లంఘనులు ఆగడం లేదు. కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ, భారీగా చలాన్లు విధిస్తున్నప్పటికీ ఇష్టారాజ్యంగా నిబంధనలు అతిక్రమిస్తూనే ఉన్నారు. గత ఏడాది ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది (జనవరి నుంచి జూన్ వరకు) ఆరు నెలల్లో భారీ స్థాయిలో ఉల్లంఘన కేసులు పెరిగాయి. కరోనా నేపథ్యంలో గత ఏడాది లాక్డౌన్ విధించారు. అదే మాదిరిగా ఈ ఏడాది కూడా కొన్ని రోజులు పరిమితులతో కూడిన లాక్డౌన్ కొనసాగింది.
ఈ సమయంలో వాహనదారులు రోడ్లపైకి వచ్చి నిబంధనలు పాటించకుండా తిరిగారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడుపొద్దనే నిబంధన ఉన్నప్పటికీ వాహనదారులు అవేవి పట్టించుకోవడంలేదు. మనకేమవుతుంది లే.. పట్టుబడితే కదా.. అనే భావనతో చాలా మంది తిరుగుతున్నారు. అయితే లైసెన్స్ లేకుండా వాహనం నడిపే వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఉన్నతాధికారులు క్షేత్ర స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో తరుచుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ఉల్లంఘన దారులపై ఉక్కుపాదం మోపుతున్నారు.
అయితే ఈ ఏడాది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపై నగర ట్రాఫిక్ పోలీసులు భారీ స్థాయిలో చలాన్లు విధించారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు 27,45,574 మంది ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించగా.. అత్యధికంగా హెల్మెట్ లేనివారు 25,43,897 మంది ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు 35,201మంది ఉండగా.. మైనర్లు 1338 మంది ఉండటం గమనార్హం.
డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే భారీ జరిమానాలు విధిస్తున్నారు. చీకటయ్యిందంటే ట్రాఫిక్ పోలీసులు మమ్మల్ని పట్టుకోరు అనే ధీమాతో ఉల్లంఘనదారులు విచ్చలవిడిగా రోడ్లపై తిరుగుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. దీన్ని కట్టడి చేసేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. రాత్రి 8గంటల నుంచి అకస్మాత్తుగా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తుండటంతో డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు పోలీసులకు పట్టుబడుతున్నారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే.. రోడ్డు ప్రమాదాలను పూర్తిస్థాయిలో కట్టడి చేసే అవకాశముంటుంది. నగరంలో సురక్షితమైన ప్రయాణమే ట్రాఫిక్ పోలీసుల లక్ష్యం. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రమాదాలకు గల కారణాలపై అధ్యయనం చేస్తున్నాం. ఇందుకు సంబంధిత లా అండ్ ఆర్డర్ పోలీసులు, జీహెచ్ఎంసీ, ఆర్అండ్బీ తదితర శాఖల సహకారం తీసుకుంటున్నాం. నిబంధనలు పాటించని వారిపై కాంటాక్టు, నాన్ కాంటాక్టు పద్ధతిలో జరిమానాలు విధిస్తున్నాం. చౌహాన్, నగర ట్రాఫిక్ డీసీపీ