సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ): ఔటర్ రింగు రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ పెరుగుతోంది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర ఉన్న ఓఆర్ఆర్ మీదుగా కోర్ సిటీ లోపలి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులతో పాటు ప్రత్యేకంగా రేడియల్ రోడ్లు, లింకు రోడ్లు ఉండటంతో నగర వాసులు ఓఆర్ఆర్ను రాకపోలకు ఎక్కువగా వినియోగిస్తున్నారు. ప్రతియేటా ట్రాఫిక్ రద్దీ 15 నుంచి 20 శాతం వరకు పెరుగుతోంది. ఇప్పటికే ఐటీ కారిడార్ పరిధిలో ట్రాఫిక్ రద్దీ పెరగడంతో కొత్తగా రెండు ఇంటర్‌చేంజ్‌లను నార్సింగి వద్ద నిర్మించి ప్రారంభించారు. అలాగే కోకాపేట నియోపొలీస్ లేఅవుట్‌ను అనుసంధానం చేస్తూ మరో ఇంటర్చేంజ్ నిర్మాణంలో ఉంది. పటాన్చెరు-దుండిగల్ మార్గంలో మల్లంపేట-బాచుపల్లి వద్ద మరో ఇంటర్‌చేంజ్‌ను నిర్మించి అందుబాటులోకి తీసుకువచ్చారు. అయినా ట్రాఫిక్ పెరుగుతుండటంతో మరిన్ని చోట్ల కొత్తగా 3 ఇంటర్‌చేంజ్‌లను నిర్మించాలని ప్రాథమికంగా హెచ్ఎండీఏ అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఔటర్ దాటిన తర్వాత ప్రాంతాల్లోనూ పట్టణీకరణ శరవేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ఇంటర్‌చేంజ్‌ల వారీగా వాహనాల రాకపోకలు గుర్తించి కొత్త ఇంటర్‌చేంజ్‌ల నిర్మాణంపై దృష్టి సారించారు.
కోహెడ వద్ద మరో ఇంటర్చేంజ్..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత హైదరాబాద్ మహానగరాభివృద్ధి అంతా పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్ వైపు ఎక్కువగా జరగడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ పెరిగింది. దానికి అటువైపు 3 ఇంటర్‌చేంజ్‌లను నిర్మించిన హెచ్ఎండీఏ, ఇప్పడు దక్షిణం, తూర్పు, ఉత్తరం దిక్కుల వైపు ట్రాఫిక్ పెరుగుతున్నట్టు తమ అధ్యయనంలో గుర్తించారు. ఇందులో మొదట కోహెడ వద్ద , కీసర -శామీర్‌పేట మధ్య, అలాగే 3వ ఇంటర్‌చేంజ్‌ను శామీర్‌పేట- దుండిగల్ మధ్య నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మూడు ప్రాంతాల్లో ఔటర్ రింగు రోడ్డుకు కలిసే లింకు రోడ్డు, రేడియల్ రోడ్లను పరిగణలోకి తీసుకొని వాటికి సమీపంలో ఇంటర్చేంజ్ నిర్మాణం చేపట్టాలని భావిస్తున్నారు. గ్రేటర్ చుట్టూ ఉన్న ఓఆర్ఆర్కు 22 ఇంటర్‌చేంజ్‌లు ఉండగా, కొత్తగా మరో మూడు చేంజ్‌లను 1-2 ఏళ్ల వ్యవధిలో అందుబాటులోకి తీసుకువచ్చేలా హెచ్ఎండీఏ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయనున్నారు. కాగా ఓఆర్ఆర్ నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు 30 ఏళ్లకు లీజుకివ్వడంతో ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న గ్రోత్ కారిడార్ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధిపై అధికారులు ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. ఇంటర్‌చేంజ్‌ల సమీపంలో టౌన్‌షిప్‌లతో పాటు మినీ పారిశ్రామిక వాడల ఏర్పాటుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించే పనిలో హెచ్ఎండీఏ ఎస్టేట్ విభాగం ఉంది.
ఔటర్ రింగు రోడ్డు స్వరూపం
రోజుకు ఔటర్లో వాహనాల రద్దీ (వాహనాల వారీగా)