సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. రెండు రోజుల నుంచి వరుసగా పగటి ఉష్ణోగ్రతలు 42డిగ్రీలు దాటి నమోదవుతుండటంతో జనం ఊష్ణతాపానికి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42.2డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.7డిగ్రీలు, గాలిలో తేమ 51 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా పగలంతా మాడు పగిలే ఎండలతో వేడెక్కిన వాతావరణం సాయంత్రం ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులతో కొంత చల్లబడినైట్లెంది. దీనికి తోడు నగరంలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురవడం నగరవాసులకు కొంత ఉపశమనం కలిగించింది.