సిటీబ్యూరో, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): నిలోఫర్ దవాఖానలో ఏర్పాటు చేసిన స్కిల్ ల్యాబ్ సత్ఫలితాలు ఇస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లల వైద్యం, అత్యవసర సేవలు తదితర అంశాలపై అవగాహన కల్పించే క్రమంలో ఏర్పాటు చేసిన స్కిల్ ల్యాబ్ ఆధునిక చికిత్స పద్ధతులు, పరికరాల వినియోగం, మెయింటెనెన్స్ తదితర అంశాలపై వైద్య సిబ్బందికి నేషనల్ నియోనాటల్ ఫోరమ్(ఎన్ఎన్ఎఫ్) ప్రతినిధులు శిక్షణ కల్పిస్తున్నారు. ఇందుకోసం నిలోఫర్ దవాఖానలో ఏడాది క్రితం ప్రత్యేకంగా స్కిల్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇందులో వైద్య విద్యార్థులతో పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులకు సైతం శిక్షణ కల్పిస్తున్నట్లు నిలోఫర్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ టి.ఉషారాణి, ఎన్ఎన్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు, నిలోఫర్ దవాఖాన యువ విభాగాధిపతి డాక్టర్ రమేశ్ దాంపురి తెలిపారు.
ప్రసవం జరిగి బిడ్డ పుట్టగానే ఏడ్వాలి. కాని కొంత మంది శిశువులు ఏడ్వరు. అది ప్రమాదకరమైన సంకేతంగా పరిగణిస్తారు. అలాంటి కేసులను ఎలా డీల్ చేయాలి? సదరు శిశువుకు ఇవ్వాల్సిన చికిత్స, చేయాల్సిన పరీక్షలు, వారి కుటుంబ సభ్యులకు సూచించాల్సిన అంశాలు తదితర వాటిపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పిస్తారు. దీంతో పాటు సిమ్యులేషన్ ల్యాబ్‌లో ప్రాక్టికల్స్ చేయిస్తామని నిలోఫర్ స్కిల్‌ల్యాబ్ ఇన్చార్జ్ డాక్టర్ స్వప్న తెలిపారు. అప్పుడే పుట్టిన శిశువుకు ఏదైన అనారోగ్యం కారణంగా ఐవీ పెట్టాల్సి వస్తే ఎలా డీల్ చేయాలి? శిశువుల పల్స్, హార్ట్‌బీట్‌ను సరిగ్గా చూడటం వంటి సున్నితమైన అంశాలను ప్రాక్టికల్‌గా చూపిస్తూ శిక్షణనిస్తామని ఆమె వివరించారు. ఇందుకోసం ప్రత్యేక పరికరాలు, అచ్చం చిన్నపిల్లలను పోలి ఉండే బొమ్మలు ఉంటాయని, వాటిలో పల్స్ కొట్టుకోవడం, హార్ట్‌బీట్ తదితర అన్ని రకాల క్రియలు జరిగేలా ఏర్పాట్లు ఉంటాయన్నారు. వీటిపై ప్రాక్టికల్స్ చేస్తే నిజమైన పిల్లలపైన చేసినట్లే ఉంటుందని తెలిపారు.
ప్రతి బ్యాచ్‌కు 30 నుంచి 40 మందికి శిక్షణనిస్తున్నట్లు డాక్టర్ స్వప్న తెలిపారు. వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులే కాకుండా సర్వీసులో ఉన్న వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి సైతం స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణనిస్తున్నామని తెలిపారు. మారుతున్న కాలంతో పాటు అందుబాటులోకి వస్తున్న ఆధునిక చికిత్స పద్ధతులు, వైద్యపరికరాల వినియోగం, ఏవైనా మరమ్మతులు తలెత్తినప్పుడు టెక్నీషియన్ లేదా మెకానిక్స్‌పై ఆధారపడి కాలయాపన చేయకుండా.. అత్యవసర పరిస్థితుల్లో ఆ పరికరాన్ని సరిచేసుకొని రోగికి వైద్యం అందించడం వంటి కీలక అంశాలపై శిక్షణనిస్తున్నట్లు వివరించారు.
ఇప్పటి వరకు దాదాపు 1000 మంది వైద్య సిబ్బందికి స్కిల్ ల్యాబ్ ద్వారా శిక్షణనిచ్చాం. వైద్యం అందించడంలో డాక్టర్ల పాత్రకు సమానంగా నర్సులు కూడా కీలక పాత్ర పోషిస్తారు. నర్సులకు కూడా వైద్యులతో సమానంగా ఈ స్కిల్ డెవలప్మెంట్పై శిక్షణనిస్తున్నాం. రోగులకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాగంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం వైద్యవృత్తిలో అవసరం. అందుకే ఈ స్కిల్‌ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చాం.
– డాక్టర్ రమేశ్ దాంపురి, యువ విభాగాధిపతి, నిలోఫర్ దవాఖాన