సంక్రాంతికి బైరామల్‌గూడ లూప్
కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) నిర్మాణాల్లో అరుదైన ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతున్నది. ఔటర్ రింగు రోడ్డు తరహాలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైరామల్‌గూడలో లూప్ అకారంలో నిర్మాణం జరిగింది.
- ఎస్ఆర్డీపీలో అరుదైన నిర్మాణం అందుబాటులోకి
- ఓఆర్ఆర్ తరహాలోరూపుదిద్దుకున్న ప్రాజెక్టు
- తుది దశకు చేరుకున్న పనులు
సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిన ఎస్ఆర్డీపీ (వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం) నిర్మాణాల్లో అరుదైన ప్రాజెక్టు అందుబాటులోకి రాబోతున్నది. ఔటర్ రింగు రోడ్డు తరహాలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైరామల్‌గూడలో లూప్ అకారంలో నిర్మాణం జరిగింది. స్థానికంగా ట్రాఫిక్ సుడిగుండాలకు శాశ్వత పరిష్కారంగా, వాహనదారులకు బహు ప్రయోజనాలతో దాదాపు రూ.135 కోట్లతో లూప్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా.. సంక్రాంతి నాటికల్లా అందుబాటులోకి తెచ్చేందుకు ఇంజినీర్లు పనులను వేగిరం చేశారు. ప్రస్తుతం లూప్ పనులు తుది దశకు చేరుకున్నాయని, వచ్చే నెలలో అందుబాటులోకి తీసుకురావాలన్న నిర్ధేశిత లక్ష్యంతో పనులను వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన 47 ప్రాజెక్టుల్లో 36 ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి. ఇదే సమయంలో ఉప్పల్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, ఆర్టీసీ క్రాస్ రోడ్ జంక్షన్ల మీదుగా చేపట్టిన సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్లు ప్రత్యేకతలు ఉండగా.. తాజాగా బైరామల్‌గూడ సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్‌తో పాటు రెండు లూప్‌లు సైతం ప్రత్యేక నిర్మాణాలుగా నిలువనున్నాయి. ఔటర్ రింగు రోడ్డు తరహాలో బైరామల్‌గూడలో లూప్‌లు రావడం ఎస్ఆర్డీపీలో తొలి నిర్మాణంగా చెప్పుకోవచ్చు. ఎల్బీనగర్, చంపాపేట, సాగర్ రింగు రోడ్డు మార్గాల వైపు వెళ్లేందుకుగాను ఈ లూప్‌లు ఎంతగానో దోహదపడనున్నాయి.
అద్భుత నిర్మాణాలకు కేరాఫ్ బైరామల్‌గూడ
రూ.134.25 కోట్లతో బైరామల్‌గూడ సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్, బైరామల్‌గూడ ఎల్హెచ్ఎస్ లూప్ రూ.21.63 కోట్లు, బైరామల్‌గూడ ఆర్హెచ్ఎస్ లూప్ రూ.22.30కోట్లతో నిర్మాణం జరుగుతున్నది. లూప్‌లు, సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్లు వచ్చే నెల రెండో వారంలో అందుబాటులోకి తీసుకువస్తామని అధికారులు పేర్కొన్నారు. బైరామల్‌గూడలో రెండు ఫ్లై ఓవర్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఎల్బీనగర్ నుంచి కర్మన్‌ఘాట్ వైపునకు వెళ్లే వాహనాలకు , అటు నుంచి ఎల్బీనగర్ చౌరస్తాకు చేరుకునే వారికి బైరామల్‌గూడ చౌరస్తాలో ఫ్లై ఓవర్లు (ఆర్హెచ్ఎస్/ఎల్హెచ్ఎస్) పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చింది.
ఈ క్రమంలోనే చాంద్రాయణగుట్ట ఒవైసీ ఆసుపత్రి, కర్మన్‌ఘాట్ వైపు నుంచి బైరామల్‌గూడ చౌరస్తాలో ఆగకుండా చింతలకుంట చెక్‌పోస్టు, గుర్రంగూడ వైపు సాగర్ రోడ్డుకు చేరుకునేలా ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతున్నది. ఇది సెకండ్ లెవల్ ఫ్లై ఓవర్. ఇప్పుడున్న ఫ్లై ఓవర్ పైనుంచి సాగిపోతుంది. కర్మన్‌ఘాట్ రోడ్డు నుంచి మూడు లేన్లతో మొదలై చౌరస్తా వద్ద ఆంగ్ల అక్షరం ‘వై’ అకారంలో రెండు వైపులా విడిపోతుంది. చింతలకుంట చెక్‌పోస్టు రోడ్డుపైకి, మరరొకటి సాగర్ రోడ్డుపైకి వాహనాలు వెళ్లనున్నాయి. ఎల్బీనగర్ నుంచి చంపాపేటకు, సాగర్ రింగు రోడ్డు నుంచి ఎల్బీనగర్కు వెళ్లాలంటే చౌరస్తా వద్ద ఆగక తప్పడం లేదు. దీనికి పరిష్కారంగా రెండు లూప్‌లను నిర్మిస్తున్నారు.
లూప్‌లతో ప్రయోజనాలు
సాగర్ రింగు రోడ్డు నుంచి ఎల్బీనగర్ వెళ్లే వాహనాలు చౌరస్తా వద్ద ఆగి, గ్రీన్ లైట్ వెలిగాక కుడివైపునకు వెళ్లాలి. ఇక మీదట ఆగకుండా వెళ్లేలా సాగర్ రింగు రోడ్డు నుంచి వచ్చే వాహనాలను చంపాపేట రోడ్డు వైపునకు తీసుకెళ్లి ఎడమవైపునకు మళ్లించి, ఆప్(ఎగువ) ర్యాంపు ద్వారా కర్మన్‌ఘాట్ – ఎల్బీనగర్ ఫ్లై ఓవర్‌కు సదరు వాహనాలను చేర్చనున్నారు.
ఎల్బీనగర్ నుంచి చంపాపేట వెళ్లే వాహనాలు చౌరస్తా వద్ద నిల్చొని కుడివైపునకు మళ్లాల్సి ఉండేది. అలాంటిదేమి లేకుండా ఎల్బీనగర్-కర్మన్‌ఘాట్ ఫ్లై ఓవర్ పైకి వాహనాన్ని తీసుకువెళ్లి, చౌరస్తా అవతల ఉండే డౌన్ (దిగువ) ర్యాంపు మీదుగా సాగర్ రోడ్డు నుంచి చంపాపేట వైపు వెళ్లే రోడ్డుకు అనుసంధానం చేయనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

