శేరిలింగంపల్లి, ఆగస్టు 11: తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్ధ(టీఎస్ఎఫ్డీసీ) ట్రీ డిజిటలైజేషన్ దిశగా అడుగులు వేస్తున్నది. అటవీ స్థలాలు, ప్రధాన అర్బన్ పార్కులు, ఎకో టూరిజం ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న ప్రాముఖ్యత కలిగిన చందనం, ఎర్రచందనం లాంటి వృక్షాలను పరిరక్షించడంతో పాటు కలప దొంగతనాలను నివారించేందుకు అవసరమైన చర్యలకు శ్రీకారం చుట్టారు. విలువైన వృక్షాలు అపహరణకు గురి కాకుండా అటవీ శాఖ యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణకు పూనుకుంది.
శుక్రవారం రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా కొత్తగూడ బొటానికల్ గార్డెన్లో ప్రయోగాత్మకంగా 50 ఎర్రచందనం, చందనం చెట్లకు ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రత్యేకంగా తయారుచేసిన రియల్ టైం ప్రొటెక్షన్ సెన్సార్ చిప్స్‌ను సెట్లకు అమర్చారు. ఇందుకోసం టీఎస్ఫ్డీసీ ఎండీ చంద్రశేఖర్, సీబీఐఓటీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈఓ సత్యనారాయణ చొప్పదండితో కలిసి ఈ నూతన ట్రీ డిజిటలైజేషన్ విధానానికి సంబంధించిన వివరాలు మీడియా సమావేశంలో వెల్లడించారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఖరీదైన చందనం, ఎర్రచందనం వృక్షాల దొంగతనం, స్మగ్లింగ్ లాంటి ఘటనలను నివారించేందుకు ఈ విధానం ఎంతగానో దోహాదపడుతున్నదని టీఎస్ఎఫ్డీసీ ఏండీ చంద్రశేఖర్ తెలిపారు. ప్రయోగాత్మకంగా కొత్తగూడ రిజర్వు పారెస్టు ప్రాంతంలోని బొటానికల్ గార్డెన్లో మొత్తం దాదాపు 10 వేల ఎర్రచందనం మొక్కలు ఉన్నాయన్నారు. మొదటి విడతగా వాటిలో 50 చెట్లకు ఈ చిప్‌సెట్‌ను అమర్చి పనితీరును పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం బెంగళూర్‌కు చెందిన సీబీఐ ఓటీ సంస్థతో ప్రయోగాత్మక ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. చెట్లను దొంగతనాల నుంచి రక్షించుకోవడంతో పాటు వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వాటి సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతున్నదని తెలిపారు.
రాష్ట్రంలో మొదటిసారిగా 500 చెట్లకు..
జీడీఐఓటీ సీఈఓ సత్యనారాయణ మాట్లాడుతూ ఖరీదైన చెట్ల సంరక్షణ కోసం తమ సంస్థ ఇండియన్ హుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐడబ్ల్యుసీటీ) సహకారంతో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు. ఈ టెక్నాలజీ విధానాన్ని ఇప్పటికే ఐడబ్ల్యుసీటీ, ఢీల్లీ ఐకార్, బెంగళూర్, జాన్సీ నగరాల్లో వాడుతున్నట్లు చెప్పారు. తెలంగాణలో మొదటి సారిగా బొటానికల్ గార్డెన్లో ఈ చిప్సెట్ సెన్సార్ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక చిప్సెట్తో పాటు లిథియం బ్యాటరీ సహాయంతో ఈ సరికొత్త టెక్నాలజీ విధానం పనిచేస్తున్నదన్నారు. ప్రతి చెట్టుకు అన్ని వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా ఈ ప్రత్యేక కవచం కలిగిన బ్యాటరీ ఆధారిత చిప్సెట్లు బెల్ట్ సహాయంతో చెట్లకు అమర్చడం జరుగుతున్నదని తెలిపారు.
500 చెట్లకు ఓ ట్రీ గేట్‌వే సెన్సార్ ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా అది సర్వర్‌కు అనుసంధానం అవుతున్నదని అన్నారు. తాము రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ సామ్స్ మొబైల్ యాప్ ద్వారా ఎప్పటికపుడు వీటి అటెండెన్స్‌ను గమనించడం జరుగుతున్నదని కేవలం ఫోన్లో పూర్తి సమాచారం లభిస్తుందన్నన్నారు. ఎవరైనా చెట్ల నరికివేతకు పాల్పడినా, చెట్లను మొదలు కొట్టివేయడం, గొడ్డలి వేట్లు, చెట్లను పడేయడం జరిగితే.. వెంటనే ఆ చెట్టుకు ఉన్న సెన్సార్ ద్వారా ఆలారం వస్తున్నదని తెలిపారు. చెట్టు లేకపోతే దాని అటెండెన్స్ మనకు ఫోన్లో కనిపించదని తద్వారా చెట్టు చోరీకి గురైందన్న సమాచారం అందుతున్నదని పేర్కొన్నారు. ఏ చెట్టు నరికివేతకు గురైందో మనకు అక్కడ ఏర్పాటుచేసిన గేట్‌వే అలారంతో పాటు మనకు ఆ చెట్టు వద్దకు వేళ్లే దారిని సైతం మొబైల్లో చూపడం జరుగుతున్నదని పేర్కొన్నారు. చెట్టుకు ఒక్కో చిప్‌సెట్‌కు రూ.2 వేలు ఖర్చు అవుతున్నదని, మూడేండ్లకు ఒకసారి బ్యాటరీ మార్చాల్సి ఉంటున్నదన్నారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రంజిత్ నాయక్, డైరెక్టర్ అక్బర్, జీఎం రవీందర్ రెడ్డి, ఎకో టూరిజం ప్రాజెక్టు మేనేజర్ సుమన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.