హైదరాబాద్ సమీపంలోని తెల్లాపూర్‌లో ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో వందలాదిమంది కొనుగోలుదారులను నిలువునా ముంచిన ఒక భారీ రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. ప్రీలాంచ్ ఆఫర్ పేరుతో తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామని చెప్పి తమ నుంచి కోట్లాదిరూపాయలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపిస్తూ పలువురు కేంద్ర ప్రభుత్వ, సాఫ్ట్వేర్ ఉద్యోగులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను బుధవారం ఆశ్రయించారు. త్రిపుర యజమాని పసుపులేటి సుధాకర్‌తో పాటు సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం త్రిపుర కన్స్ట్రక్షన్స్ తమ సొంతింటి కల నెరవేరుస్తామంటూ వందలాదిమంది నుంచి సుమారు రూ.500కోట్లు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారని వారు పేర్కొన్నారు. 2021లో సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ప్లాట్లు నిర్మించి ఇస్తామంటూ త్రిపుర కన్స్ట్రక్షన్స్ సంస్థ ప్రీలాంచ్ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్ ధరకంటే తక్కువకే సొంతింటి కల నెరవేర్చుకోవచ్చన్న ఆశతో బీడీఎల్ సిబ్బంది, సాఫ్ట్వేర్ ఇంజినీర్లతో పాటు పలువురు ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు ఈ సంస్థకు లక్షల్లో డబ్బులు చెల్లించారు. డబ్బులు తీసుకున్న తర్వాత ఏళ్లు గడుస్తున్నా నిర్వాహకులు మాత్రం ఆ స్థలంలో పునాది నిర్మాణం కూడా చేపట్టలేదని బాధితులు చెప్పారు. ప్లాట్ల నిర్మాణం చేపట్టకుండా సంస్థ ప్రతినిధులు చాలాకాలం కాలయాపన చేయడంతో బాధితులు ప్లాట్ల నిర్మాణం లేదా తమ డబ్బులు తమకు ఇవ్వాలంటూ త్రిపుర సంస్థ ప్రతినిధులను ప్రశ్నించారు. తాము ఏళ్ల తరబడి దాచుకున్న పొదుపు మొత్తాలను సంస్థకు చెల్లించామని వారు పేర్కొన్నారు తమ దగ్గరి నుంచి డబ్బులు తీసుకున్న తర్వాత త్రిపుర సంస్థ ప్లాట్ల నిర్మాణాలు ప్రారంభించకపోగా ప్లాట్ల కోసం కేటాయించిన భూమిని వేరొక రియల్ఎస్టేట్ కంపెనీకి అమ్మేందుకు ప్రయత్నిస్తున్నట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఒకవైపు ప్లాటు ఇవ్వక , అటు చెల్లించిన సొమ్మును తిరిగి ఇవ్వకపోవడంతో వారంతా లబోదిబోమంటున్నారు. వందలాదిమంది నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేశారంటూ సంస్థ చైర్మన్ పసుపులేటి సుధాకర్‌పై బాధితులు సీసీఎస్ పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ భారీ స్కామ్‌పై సమగ్రదర్యాప్తు జరిపి నిందితులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని, తమ సొమ్ము రికవరీ చేసి న్యాయం చేయాలని కోరారు. ఫిర్యాదు తీసుకున్న సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని వారికి తెలిపారు. అయితే పసుపులేటి సుధాకర్ గతంలోనే ఈ కేసులో అరస్టై బెయిల్‌పై వచ్చి తిరుగుతున్నారని తెలిసింది. అంతేకాకుండా ఒక పార్టీ తరపున ఆంధ్ర ప్రాంతంలో పోటీ చేసినట్లు కూడా సమాచారం. ప్రస్తుతం తెల్లాపూర్‌లోనే మరో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి ఆ పనులు కూడా మందకొడిగా సాగుతున్నాయని, సుధాకర్ వ్యవహారంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.