అబిడ్స్, డిసెంబర్ 28: ఇంజనీరింగ్ విద్య సామాజిక ప్రగతికి ఎంతగానో దోహదపడుతుందని తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ ఫైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్ పేర్కొన్నారు. అబిడ్స్ చాపెల్ రోడ్‌లోని స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ ఆధ్వర్యంలోని కళాశాలలో రెండు రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు జరుగుతున్న విషయం తెలిసిందే. రీసెర్చ్ ఇంటల్లీజెంట్ కంప్యూటింగ్ ఇన్ ఇంజనీరింగ్ (RICE-2024) పై నిర్వహించిన తొమ్మిదో అంతర్జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఇందుకు తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ ఆఫ్ ఫైర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ శ్రీరాం వెంకటేశ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్శిటీ హైదరాబాద్, యూనివర్శిటీ ఆఫ్ డాన్ బాస్కో ఎల్ సాల్వడార్లు సంయుక్తంగా నిర్వహించిన సదస్సుకు డాక్టర్ విజయేందర్ కుమార్ సోలంకి అధ్యక్షత వహించగా, శ్రీరామ్ వెంకటేశ్ మాట్లాడుతూ కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ తదితర విభాగాలలో కృత్రిమ మేధ నేడు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూడా కృత్రిమ మేధను అభివృద్ధి చేయడానికి అన్ని రంగాలలో చర్యలు తీసుకుంటుందన్నారు. ఇంజనీరింగ్ విద్యలో ఒక్కో విభాగానికి ఒక్కో ప్రాధాన్యత ఉంటుందన్నారు. కృత్రిమ మేధ అనేది అన్ని విభాగాలను కలిపి కొత్త ప్రయోజనాలను చేకూర్చే విధంగా ఉంటుందని చెప్పారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఉస్మానియా యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.చంద్రశేఖర్ మాట్లాడుతూ పరిశోధనలలో నాణ్యతకు పెద్ద పీట వేయాలని రీసెర్చ్ స్కాలర్లను కోరారు.
ఇంజనీరింగ్‌లో పరిశోధనలను కళాశాలలు ప్రోత్సహించాలని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సదస్సులో ప్రదర్శించిన పరిశోధన పత్రాలలోఉత్తమమైన పరిశోధనా పత్రాలకు కళాశాల సెక్రటరీ, కరెస్పాండెంట్ కె.కృష్ణారావు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ, కరెస్పాండెంట్ కె.కృష్ణారావు, డైరెక్టర్లు టి.రాకేశ్ రెడ్డి, ఆర్.ప్రదీప్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ సత్యప్రసాద్ లంక, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ బీవీ రమణమూర్తి, అకడమిక్స్ డీన్ డాక్టర్ ఎ.వినయ్‌బాబు, డైరెక్టర్ వి.అనూరాధ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఎ.రమేశ్, కన్వీనింగ్ టీమ్ డాక్టర్ ఎం.స్వప్న, డాక్టర్ శివాని యాదవ్, డాక్టర్ జి.కార్తీక్, రీసెర్చ్ స్కాలర్స్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.