సిటీ బ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ఉన్నతాధికారుల వరుస తప్పిదాలతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కీర్తి పాతాళానికి పడిపోతున్నది. తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది ఉన్నతాధికారుల గుత్తాధిపత్యంతో దేశంలోనే టాప్‌టెన్‌లో ఉన్న యూనివర్సిటీ ప్రతిష్ఠ క్రమక్రమంగా దిగజారిపోతున్నది. క్యాంపస్‌లో నెలకొన్న సమస్యలు, ఉన్నతాధికారుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తున్న విద్యార్థి సంఘాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. లింగ్డే సిఫార్సులు, స్టూడెంట్ యూనియన్ రాజ్యాంగ నియమాలను తుంగలో తొక్కుతూ నిర్ణయం తీసుకున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థుల బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు. దేశంలోనే అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాల్సిన యూనివర్సిటీని ఉన్నతాధికారులు తమ స్వప్రయోజనాల కోసం వాడేస్తున్నారు. తాజాగా ఉన్నతాధికారుల తప్పులు, క్యాంపస్‌లో నెలకొన్న సమస్యలను ఎత్తిచూపుతున్నందుకు ఏకంగా స్టూడెంట్ యూనియన్నే రద్దు చేశారు. గడువు ముగియకుండానే, నిబంధనలకు విరుద్ధంగా వీసీ, రిజిస్ట్రార్, విద్యార్థి సంక్షేమ డీన్ ఏపక్ష నిర్ణయం తీసుకున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇంకా నెల రోజులు సమయం ఉన్నప్పటికీ జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేయకుండా ఆకస్మిక నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. గురువారం క్యాంపస్ మెయిన్ గేట్ వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు.
యూనివర్సిటీలోని సమస్యలపై విద్యార్థులు చేస్తున్న వరుస ఉద్యమాల వల్లనే స్టూడెంట్ యూనియన్ను రద్దు చేశారని చెప్తున్నారు. ముఖ్యంగా యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల భూములను కాపాడేందుకు వారు చేసిన ఉద్యమాన్ని వీసీ, రిజిస్ట్రార్ జీర్ణించుకోలేకపోయారని ఆరోపిస్తున్నారు. అదేవిధంగా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌ను శాశ్వత ప్రాతిపదికన, టీచింగ్ ఫ్యాకల్టీని నియమించాలని ఉద్యమించారు. క్యాంపస్‌లో నాన్ టీచింగ్ సిబ్బంది ఆధిపత్యాన్ని ప్రశ్నించారు. నాన్ టీచింగ్ సిబ్బంది ప్రొఫెసర్లపై పెత్తనం చెలాయించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.
దీంతో పాటు విద్యార్థులు అనేక సమస్యలపై తమ గళం బలంగా వినిపించడంతో ఉన్నతాధికారులు ఇరకాటంలో పడ్డారు. ప్రతి తప్పిదాన్ని ప్రశ్నిస్తుండటంతో తమకు అనుకూలమైన వారు యూనియన్ కార్యవర్గంలో ఉండేందుకు చేసే ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతమున్న యూనియన్ను నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారని విద్యార్థులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కేవలం తమకు అనుకూలమైన విద్యార్థి సంఘానికే అధికారం ఇవ్వాలని ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు.
క్యాంపస్‌లో ఏబీవీపీ ఆధిపత్యాన్ని తీసుకొచ్చేందుకే అక్రమంగా స్టూడెంట్ యూనియన్ను రద్దు చేశారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అందుకే ఒకనెల గడువు ఉండగానే యూనియన్ను ఏకపక్షంగా రద్దు చేశారని మండిపడుతున్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తున్నందున బీజేపీ మెప్పు పొందే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
అందులో భాగంగానే బీజేపీ అనుబంధ సంస్థ అయిన ఏబీవీపీని ప్రమోట్ చేసేందుకు ఉన్నతాధికారులు సకల ప్రయత్నాలు చేస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అటు యూనివర్సిటీలోని అన్ని విభాగాల్లో నాన్ టీచింగ్ సిబ్బంది ఆధిపత్యం పెరిగిపోతున్నదని, వారు చెప్పిందే వేదం అనేలా పరిస్థితులు మారిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు కూడా స్టూడెంట్ యూనియన్ను రద్దు చేసేలా విద్యార్థి సంక్షేమ డీన్, వీసీ, రిజిస్ట్రార్‌ను ప్రభావితం చేశారని చెప్తున్నారు. ప్రశ్నించే స్టూడెంట్ యూనియన్ ఉంటే తమ ఆధిపత్యం సాగటం కష్టమనే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
నిబంధనలకు విరుద్ధంగా స్టూడెంట్ యూనియన్ను రద్దు చేయడమంటే విద్యార్థుల హక్కులను హరించడమే. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన హెచ్‌సీయూలో ఇలాంటి పరిస్థితి రావడం తీవ్ర అవమానకరం. ఇప్పటికే యూనివర్సిటీ ర్యాంకింగ్ ఏటా తగ్గిపోతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో లింగ్డే సిఫార్సులను పట్టించుకోకుండా వీసీ, రిజిస్ట్రార్, విద్యార్థి సంక్షేమ డీన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే తమకు అనుకూలమైన వారిని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీ ఉన్నతాధికారుల ఏకపక్ష నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మమ్మల్ని ఎంత అణచాలని ప్రయత్నించినా విద్యార్థుల సమస్యలు, యూనివర్సిటీ భవిష్యత్తుపై పోరాటం చేస్తూనే ఉంటాం.
– ఉమేశ్ అంబేద్కర్, స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్, హెచ్‌సీయూ