సికింద్రాబాద్, జనవరి 16:కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఒకటో వార్డు….అలా అభివృద్ధి బాటలో శరవేగంగా ముందుకుసాగుతుంది. ఏడేండ్లల్లో ఒకటో వార్డు రూపు రేఖలే మారిపోయాయి. నిధులు లేక అభివృద్ధికి నోచుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందజేయడంతో అభివృద్ధి కార్యక్రమాలు ఊపందుకున్నాయి. రాష్ట్ర సర్కారు బోర్డుకు నిధుల కేటాయింపుతో వార్డులో మందగించిన అభివృద్ధి పనులు చురుకుగా సాగుతున్నాయి. దీంతో పాటు 2019-21లో వార్డులో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డి అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడంతో పాటు వాటిని పూర్తి చేయించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరే దిశగా కృషి చేస్తున్నారు. వార్డులోని ముఖ్య ప్రాంతాల్లో ప్రజా అవసరాలకు సంబంధించిన సేవలు ఆయా కాలనీల పరిసర ప్రాంతాల్లోనే అందుతుండటంతో బస్తీవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అభివృద్ధిలో మేటి….
కంటోన్మెంట్ బోర్డు నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధులు, ఎమ్మెల్యే సాయన్న కోటా నుంచి విడుదలైన నిధులతో అభివృద్ధి పనులకు ఆటంకాలు లేకుండా కృషి చేస్తున్నారు. బాపూజీనగర్, నేతాజీనగర్తో పాటు పలు కాలనీల్లో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాళ్లు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే బాపూజీనగర్‌లోని పలు కాలనీల్లో సీసీ రోడ్ల నిర్మాణాలు కూడా పూర్తయ్యాయి. రూ.44లక్షల వ్యయంతో భూగర్భ డ్రైనేజీ పనులు త్వరలో పూర్తి కానున్నాయి. అంతేకాకుండా గతంలో వేసిన మంచినీటి పైపులైన్ల స్థానంలో నూతన పైపులైన్ వ్యవస్థ ఏర్పాటుకు సుమారు రూ.26లక్షల 40వేల వ్యయంతో కాలనీల్లో నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు సౌజన్య కాలనీతో పాటు మరో నాలుగు కాలనీల్లో రూ.15లక్షలతో బోర్లను వేయించారు. సూమారు రూ.15లక్షల వ్యయంతో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాళ్లను త్వరితగతిన పూర్తి చేసేందుకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డితో పాటు టీఆర్ఎస్ నాయకులు నిమగ్నమయ్యారు.
ఆదర్శంగా వార్డును తీర్చిదిద్దాం
బోర్డు నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో ఒకటోవ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. వార్డులో నిర్మాణాల్లో ఉన్న కమ్యూనిటీ హాళ్లు పనులు త్వరలోనే పూర్తికానున్నాయి. మరోవైపు గత వారమే సుమారు రూ.72లక్షల చిన్నతోకట్ట నుంచి కంసారి బజార్ చాయ్అడ్డా వరకు చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి. వార్డులోని ప్రతి బస్తీలో సీసీ రోడ్లు , భూగర్భ డ్రైనేజీ మరమ్మతులు, నూతనంగా బోర్వెల్లు వేయించడంతో పాటు బోర్ వాటర్లైన్లు కూడా పూర్తి చేయించాం.