సిటీబ్యూరో, ఫిబ్రవరి 12 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ పోలీసులు నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌తో రోడ్డు ప్రమాదాలు తగ్గడంతోపాటు చోరీకి గురైన వాహనాలు కూడా పట్టుబడుతున్నాయి. ప్రతినెల 30 నుంచి 40 చోరీకి గురైన వాహనాలు, నేరగాళ్లు పట్టుబడుతున్నారు. వాహనం పోగొట్టుకున్న బాధితులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేస్తే, ఆ వాహనం నంబర్ ట్రాఫిక్ పోలీస్ డాటా బేస్‌లోని స్టోలెన్ వెహికల్ నంబర్ డాటాలోకి వెళ్తుంది. దుండగులు చోరీ చేసిన వాహనాల పైనే తిరుగుతూ నేరాలకు పాల్పడుతున్నారు. స్పెషల్ డ్రైవ్ తనిఖీల్లో నగర పోలీసులు గట్టి నిఘా పెట్టి చోరీకి గురైన వాహనాలను గుర్తించి పట్టుకుంటున్నారు. వాహనం చోరీకి గురైన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఆ వాహనం సమాచారాన్ని తనిఖీ పోలీసుల వద్ద ఉండటంతో తొందరగా పట్టుకోవచ్చని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు.
వెంటనే ఫిర్యాదు చేయాలి..
వాహనం చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. పోలీసులు వెంటనే పూర్తి సమాచారం సేకరించి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్ నమోదైన కేసులు ట్రాఫిక్ పోలీసు డాటాబేస్‌లో ఉంటాయి. అపహరణకు గురైన వాహనాల చిట్టా ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉండటంతో తనిఖీల సమయంలో చోరీకి గురైన వాహనాలు చిక్కుతున్నాయి. ఫిర్యాదు చేయడంలో ఆలస్యం చేసినా.. ఎఫ్ఐఆర్ నమోదు చేయించకున్నా.. పోయిన వాహనాలు చిక్కే అవకాశం తక్కువగా ఉంటుందని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. చోరీ చేసిన వాహనాలపై తిరిగే నేరగాళ్లు ఒకవేళ చలాన్ చెల్లించినా వాహనం పట్టుబడే అవకాశం ఉందని, ఇటీవల కొన్ని కేసులు ఛేదించినట్టు చెప్పారు. ఈ మధ్య కాలంలో వరుసగా నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌లో నెలలో 30 నుంచి 40 చోరీకి గురైన వాహనాలను గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆలస్యం చేయడంతోనే..
వాహనం పోయిన వెంటనే వాహనదారుడు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. పోలీసులు కేసు నమోదు చేయాలి. చాలా వరకు అలా జరగడం లేదు. కొన్ని సందర్భాల్లో బాధితులు ఆలస్యంగా ఫిర్యాదు చేస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో.. పోలీసులు కూడా వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదు. వాహనం దొరికే అవకాశం ఉండటంతో ఒకటి రెండు రోజులు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసిన తర్వాత వాహనం దొరికితే.. ఆ వాహనాన్ని బాధితుడు న్యాయస్థానం నుంచి తీసుకోవాల్సి వస్తుంది. చట్టాలపై అవగాహన లేని చాలా మంది… వాహనం దొరికిన తర్వాత కూడా పోలీసులు ఇవ్వడంలేదని బాధపడుతుంటారు. కోర్టుకు వెళ్లడంతో ఇబ్బంది పడుతున్నారు. వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకున్న పోలీసులు.. వాహనం దొరికే అవకాశం ఉన్న సందర్భాల్లో మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో ఒకటి రెండు రోజులు వేసి చూస్తున్నారు. ఈ మధ్య కాలంలో తరచూ స్పెషల్ డ్రైవ్ తనిఖీలు ఉండటంతో ఎవరైనా వాహనం పోయినట్టు ఫిర్యాదు చేస్తే ఆ వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు.