సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఇల్ల్లు ఖాళీ చేయించిందనే కక్షతో ఓ వృద్ధురాలిని, ఆధారాలు లభించొద్దనే ఉద్దేశంతో 9ఏండ్ల చిన్నారిని దారుణంగా హత్యచేసిన కేసును 24గంటల్లోనే శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు ఛేదించారు. హత్యచేసిన బిహార్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శనివారం నందిగామ పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు. నందిగామకు చెందిన ఎర్రగారి పార్వతమ్మ(60) వృత్తిరీత్యా అంగన్వాడీ ఆయా. భర్త, పెద్ద కుమారుడు చనిపోయాడు.
మరో కొడుకు ఇంటినుంచి వెళ్లి పోవడంతో ఆమె ఒంటరిగానే నివసిస్తున్నది. పార్వతమ్మ పక్కనే ఉంటున్న తన చెల్లెకొడుకు కృష్ణయ్య కుమార్తె భాను ప్రియ(9)ను తోడుగా పెట్టుకుని బాలిక బాగోగులు చూసుకుంటున్నది. ఇదిలా ఉండగా… ఏప్రిల్‌లో బిహార్‌కు చెందిన దివాకర్సాహు(23) తన భార్య అంజలిదేవితో కలిసి పార్వతమ్మ ఇంటిలో అద్దెకు దిగారు. అయితే తరచూ భార్యాభర్తలు గొడవ పడుతుండటంతో పార్వతమ్మ వారిని ఇళ్లు ఖాళీ చేయించింది. దీంతో పార్వతమ్మపై కక్ష్య పెంచుకున్న దివాకర్ సాహు ఎలాగైన పార్వతమ్మను అంతమొందించాలనుకున్నాడు. పార్వతమ్మ ఇంటిలో అద్దెకుంటున్న క్రమంలో ఆమెకు ఎవరూ లేరనే విషయాన్ని గమనించడంతో పాటు వృద్ధురాలి వద్ద డబ్బు, నగలు ఉన్నట్లు గుర్తించాడు.
ఈ మేరకు పథకం ప్రకారం పార్వతమ్మ ఇంటికి సమీపంలోనే ఇళ్లు అద్దెకు తీసుకుని నివాసముంటూ అదునుకోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 16న అర్ధరాత్రి 1.30గంటల సమయంలో నిద్రలేచిన దివాకర్ కాలకృత్యాలకు వెళ్తున్నట్లు భార్య అంజలికి చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. నేరుగా పార్వతమ్మ ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న ఆమెను గొంతు పట్టుకుని, ఇటుకతో తలపై మోది చంపాడు. ఈ అలజడితో నిద్రలేచిన చిన్నారి భానుప్రియ గట్టిగా ఏడ్వడంతో దివాకర్ ఇటుకతో చిన్నారి తలపై కొట్టాడు. చిన్నారి బతికి ఉంటే తనను గుర్తిస్తుందని భావించిన నిందితుడు కత్తితో భానుప్రియ గొంతు కోసి దారుణంగా హత్యచేశాడు. ఇంట్లోకి వెళ్లి అల్మారాలో ఉన్న బంగారు నగలు, నగదు తీసుకొని పరారయ్యాడు.
ఈ మేరకు చిన్నారి తల్లి శశికళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఏసీపీ భాస్కర్‌గౌడ్ పర్యవేక్షణలో శంషాబాద్ ఎస్వోటీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణగౌడ్, నందిగామ ఇన్స్పెక్టర్ రామయ్య తన బృందంతో రంగంలోకి దిగి విచారణ చేశారు. ఈ క్రమంలో మృతురాలు పార్వతమ్మ ఇంటిలో గతంలో అద్దెకు ఉన్న దివాకర్‌పై అనుమానం రావడంతో అతడిని పట్టుకొని విచారించగా చేసిన నేరాన్ని అంగీకరించాడు. జంట హత్యలు జరిగిన 12గంటల్లోనే కేసును ఛేదించి, నిందితుడిని పట్టుకున్న పోలీసు బృందాలను ఈ సందర్భంగా డీసీపీ నారాయణరెడ్డి అభినందించారు.