Bollaram | సికింద్రాబాద్– మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంపు ఫైరింగ్ రేంజ్ వెనుక బకెట్లో డిటోనేటర్లు లభ్యమవడం కలకలం రేపింది. ప్లాస్టిక్ బకెట్‌లోని 8 బండిల్స్‌లో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ దాదాపు రూ.32 వేలు ఉంటుందని ఆర్మీ అధికారులు తెలిపారు. ఆర్మీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు బాంబ్ డిస్పోజల్ టీమ్‌కు పోలీసులు సమాచారమందించారు. కాగా, సికింద్రాబాద్ బొల్లారం ప్రాంతంలోని 20 మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆర్మీ అంతర్గత విచారణతో పాటు హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. తాజాగా కేంద్ర మిలటరీ ఇంటెలిజెన్స్ కూడా రంగంలోకి దిగింది.
ఆయుధాల చోరీ వెనుక బయటి వ్యక్తులతో పాటు లోపలి వ్యక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో విచారణ సాగుతోంది. ఆగస్టు 30 రాత్రి నుంచి 31వ తేదీ తెల్లవారుజాము మధ్య చోరీ జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆర్మరీలోని ఆయుధాల పెట్టెల తాళాలు పగులగొట్టి ఒక ఇన్సాస్ రైఫిల్, నాలుగు ఏకే-47లు, ఆరు పిస్టళ్లు సహా మొత్తం 12 ఆయుధాలను అపహరించినట్లు సమాచారం. వీటితో పాటు 21 మ్యాగజైన్లు, 1,912 రౌండ్ల తూటాలు, నైట్ విజన్ బైనాక్యులర్ కూడా చోరీకి గురైనట్లు తెలుస్తోంది.