కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిక సల్మాన్ రాకతో క్యాడర్లో పెరిగిన జోష్ గులాబీ గెలుపుపై పెరిగిన విశ్వాసం హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తేతెలంగాణ): హైదరాబాద్ యూత్ కరేజ్ వ్యవస్థాపక అధ్యక్షుడు, సోషల్ మీడియా యాక్టివిస్ట్ సల్మాన్‌ఖాన్ చేరికతో బీఆర్ఎస్లో సమరోత్సాహం కనిపిస్తున్నది. మరో రెండు వారాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరగనున్న తరుణంలో ఈ పరిణామం గులాబీపార్టీకి మరింత ఊపునిస్తుందనే చర్చ జరుగుతున్నది. కొన్నేళ్లుగా హెచ్వైసీ ద్వారా సల్మాన్‌ఖాన్ విస్తృతంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్టా, ఎక్స్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం సమాజంలో చైతన్యం నింపేందుకు నిరంతరం తపిస్తున్నారు. ఆయనకు సోషల్ మీడియాలో సుమారు 9 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. విదేశీయులు సైతం సల్మాన్ ఖాన్‌ను అనుకరిస్తుండడం గమనార్హం. అలాగే ముస్లిం యువతలో ఆయనకు ఎనలేని క్రేజ్ ఉన్నది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో నిలిచేందుకు నామినేషన్ సైతం దాఖలు చేశారు. అయితే అనూహ్య పరిణామాల మధ్య తప్పుకున్నారు. గురువారం కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అన్ని పార్టీల కంటే ముందు అభ్యర్థిని ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తున్న బీఆర్ఎస్కు హెచ్వైసీ అధ్యక్షుడు సల్మాన్‌ఖాన్ చేరికతో విజయంపై విశ్వాసం రెట్టింపు అయింది. ఇప్పటికే అనేక మంది ముఖ్యనేతల చేరికతో ఊపు మీద ఉన్న గులాబీ పార్టీలోకి సల్మాన్ రాకతో క్యాడర్లో మరింత జోష్ పెరిగింది. ముఖ్యంగా ముస్లింల ఓట్లు గంపగుత్తగా కారు పార్టీకే పడుతాయని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్ది కాంగ్రెస్ నిర్వీర్యమవుతుందని చెబుతున్నారు. ఇందుకు భిన్నంగా బీఆర్ఎస్ విజయం దిశగా దూసుకెళ్తుందని విశ్లేషిస్తున్నారు. రోజురోజుకూ ఆ పార్టీలోకి వస్తున్న వలసలే నిదర్శమని ఉదహరిస్తున్నారు.