కందుకూరు ,జూలై 1: ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిషత్ సమావేశపు హాలులో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద మంజూరైన 31 మంది లబ్ధిదారులకు చెక్కులు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.
మహిళలకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను చూసి నేర్చుకోవాలి తప్ప విమర్శించడం సమంజసం కాదని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ను తిట్టడం తప్ప పరిపాలనపై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు. పాలనను గాలికి వదిలేసి గాలిలో చక్కర్లు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల రుణమాఫీతో పాటు రైతుభరోసా రైతులందరికీ వర్తింప చేయాలని కోరారు .ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
గురుకులాలతోపాటు అనేక పాఠశాలలో పాఠ్య పుస్తకాలు డ్రెస్సులు విద్యార్థులకు అందలేదని తెలిపారు. విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు. రద్దయిన దివ్యాంగుల పింఛన్లను మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గోపాల్, డిప్యూటీ తహసీల్దార్ శేఖర్, మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణనాయక్, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సురసాని సురేందర్ రెడ్డి, గంగాపురం లక్ష్మైనర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, సీనియర్ నాయకుడు కాకి దశరథ ముదిరాజ్, నియోజవర్గం కార్యదర్శి సామ మహేందర్ రెడ్డి , ఎంపీటీసీ ఫోరం మాజీ అధ్యక్షుడు సురసాని రాజశేఖర్ రెడ్డి, ఎస్టీసెల్ మాజీ అధ్యక్షుడు లచ్య నాయక్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పొట్టి ఆనంద్, సురసాని శేఖర్ రెడ్డి, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, యూత్ అధ్యక్షుడు తాళ్ల కార్తీక్ ,సోషల్ మీడియా కన్వీనర్ బొక్క దీక్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.