సిటీబ్యూరో, మే 27 (నమస్తే తెలంగాణ) : నగరంలోని ఆర్టీఏ కార్యాలయాల్లో ఏజెంట్ల ఆగడాలు పేట్రేగిపోతున్నాయి. కొందరు అధికారుల అండదండలతో డబ్బులిస్తేనే సేవలందేల చక్రం తిప్పుతున్నారు. ఈ తతంగంపై ఫిర్యాదు అందుకున్న ఏసీబీ అధికారులు బుధవారం మేడ్చల్, కొండాపూర్, నాగోల్ ఆర్టీఏ కార్యాలయాల్లో సోదాలు జరిపారు. ఉదయం అకస్మాత్తుగా కార్యాలయాల్లోకి ప్రవేశించిన అధికారులు తలుపులు మూసి అక్కడ ఉన్న వారందరిని అధికారులతో సహా విచారించారు. ఈ విచారణలో పలువురి ఏజెంట్ల వద్ద వందల సంఖ్యలో ఆర్సీ, లైసెన్స్ కార్డులు ఉన్నట్టు గుర్తించారు. పలు డాక్యుమెంట్లను పరిశీలించారు. డ్రైవింగ్ స్కూల్ ఓనర్స్ సైతం అక్కడే ఉండి వారి కస్టమర్లను పాస్ చేయిస్తున్నారని గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.41వేలు స్వాధీనం చేసుకున్నారు. ఒక్క రోజులో వచ్చిన 185 డ్రైవింగ్ లైసెన్స్‌లు ఒక్కటి కూడా రిజక్ట్ చేయకుండా అప్రూవల్ చేసినట్టు ఏసీబీ అధికారులు గుర్తించా రు. అధికారులు లంచాలు తీసుకుంటున్నట్టు ఫిర్యాదులు సైతం అందాయని వివరించారు. కా గా, తమ రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందిస్తామని ఏసీబీ పేర్కొంది. ఎవరైన అవినీతికి పాల్పడితే ఏసీ బీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కి ఫిర్యాదు చేయాలని వాహనదారులకు అధికారులు సూచించారు.
ఇష్టారాజ్యం..
మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో అవినీతి పేట్రేగిపోతున్నదని ఏసీబీకి ఫిర్యాదులు అధిక సంఖ్యలో అందాయి. ఈ 5 నెలల్లో ఇది రెండో సారి దాడులు చేయడం. నగర శివార్లలో వాహనాలు అత్యధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్ అవుతుంటాయి. లైసెన్స్ కోసం వందలాది మంది వాహనదారులు కార్యాలయాలకు వస్తుంటారు. వాహన ట్రాన్షపర్, పర్మిట్ల జారీ, ఫిట్నెస్లు ఇలా అనేక పనులపై ఏజెంట్లు పనిచేస్తుంటారు. ఒక్కో పనికి ఓ రేటు ఫిక్స్ చేసి అధికారుల చేతులు తడుపుతుంటారు. సందేహాన్ని నివృత్తి చేసుకోవాలన్నా అధికారులు స్పందించరు.. చివరికి ఏజెంట్లను సంప్రదించి సమాచారం తెలుసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మేడ్చల్, రంగారెడ్డిలోని కొండాపూర్, మణికొండ కార్యాలయాల్లో అవినీతి తారాస్థాయికి చేరిందని ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదులు అందాయి. అందులో భాగంగానే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి పలు అక్రమాలను గుర్తించి రిపోర్ట్ రెడీ చేశారు. సదరు అధికారులపై శాఖపరమైన చర్యలు ఉంటాయని ఏసీబీ హెచ్చరించింది.
సీసీ కెమెరాలున్నా వృథానేనా..?
ఆర్టీఏ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఏజెంట్ల ఆగడాలకు చెక్ పెడుతామని రవాణా శాఖ కమిషనర్ గతంలో పేర్కొన్నారు. సుమారు రూ. 5 లక్షల ఖరీదైన అత్యాధునిక కెమెరాలను కార్యాలయాల్లో ఇన్స్లాట్ చేశారు. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా ఖైరతాబాద్‌లో ఇన్స్టాల్ చేశారు. ఈ తరహా కెమెరాలను అన్నీ ఆర్టీఏ కార్యాలయాల్లో పెడుతామని అధికారులు చెప్పారు. ఈ కెమెరాలతో కార్యాలయాల్లోకి ప్రయివేట్ వ్యక్తులు ఎవరు ఎన్ని సార్లు వస్తున్నారో వివరాలు పరిశీలించి డేటా ఇస్తుంది. కానీ అవి మాటలకే పరిమితమవడంతో ఎప్పటిలాగానే ఆర్టీఏ కార్యాలయాల్లో కొందరు అధికారులు, ఏజెంట్లది ఆడిందే ఆట గా మారింది. ముఖ్యంగా మణికొండ, కొండాపూర్, మేడ్చల్ ప్రధాన కార్యాలయాలు వాహనదారులు వివిధ సేవల కోసం వస్తే ఏదో ఒక కొర్రీ పెట్టి ఆ పనులను రిజక్ట్ చేస్తున్నారు. మళ్లీ అవే డాక్యుమెంట్లతో ఏజెంట్లను సంప్రదిస్తే పనులు పూర్తవుతున్నాయి. నెలకు లక్షలాది రూపాయలు వెనకేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఆర్టీఏ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని కట్టడి చేయాలని వాహనదారులు సైతం డిమాండ్ చేస్తున్నారు.