బండ్లగూడ, మార్చి 8 : దారి దోపిడీకి పాల్పడిన ముగ్గురు దుండగులను మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. దుండగుల నుంచి రూ.18 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ శిఖర జిల్లా ఫతేపూర్ కు చెందిన సచిన్ స్వామి కాటేదాన్ లోని సుమిత్ మోడీకి చెందిన ఎస్ఆర్ఎమ్ ప్లాస్టిక్ కంపెనీలో పనిచేశారు. రెండు సంవత్సరాల క్రితం సచిన్ ను యాజమాన్యం పనిలో నుంచి తొలగించింది.
అప్పటినుంచి పగపెంచుకున్నాడు. అదే కంపెనీలో పని చేస్తున్న తన గ్రామానికి చెందిన హేమంత్ శర్మతో చేతులు కలిపాడు. హేమంత్ శర్మ కంపెనీలో యజమాని కదలికలను సచిన్ కు అందించారు. సుమిత్ తను బామ్మర్ది జితేందర్ బాలాజీ ని రాఘవేంద్ర నగర్ లోని తన ఇంటి నుంచి రూ.20 లక్షలు తీసుకురమ్మని ఆదేశించారు. ఇది తెలుసుకున్న హేమంత్ సచిన్‌కు సమాచారం అందించాడు. టీవీఎస్ మోటార్ సైకిల్ పై రూపాయలను తీసుకువస్తున్న జితేందర్‌ను కారుతో వచ్చిన దుండగులు రాఘవేంద్ర కాలనీలో ఢీ కొట్టారు.
జితేందర్ కింద పడిపోగానే రూ.20 లక్షల బ్యాగును తీసుకొని స్వామి ముఠా పరార్ అయింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ మైలార్‌దేవ్‌పల్లి క్రై విభాగం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. వాహనంలో నిర్మల్ నుంచి మహారాష్ట్ర వైపు వెళుతున్నట్టు గుర్తించారు. దీంతో రాజేంద్రనగర్ ప్రత్యేక పోలీసు బృందాలు పట్టుకున్నారు. వారి వద్ద రూ.18 లక్షలు, 3 మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన మైలార్దేవులపల్లి, సిసిఎస్, ఎస్ఓటి పోలీసులను డీసీపీ చింతమనేని శ్రీనివాస్ అభినందించారు.