సిటీబ్యూరో, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తగా జోన్లను ఏర్పాటు చేస్తూ, ఆయా జోన్లను పునర్విభజన చేస్తున్నారు. ఇటీవల కొత్త ఠాణాలు, డివిజన్లు, జోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పునర్విభజన ప్రతిపాదనలను కార్యరూపంలోకి తీసుకొస్తున్నారు. ఇందులో భాగంగానే కొత్తగా 13 ఠాణాలు, 10 డివిజన్లు, రెండు జోన్లు ఏర్పడుతున్నాయి. విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌లో జనాభా రోజురోజుకూ పెరుగుతున్నది. అపార్టుమెంట్ సంస్కృతి పెరగడంతో జనాభా సంఖ్య కూడా పెరుగుతున్నది. ఇందుకు అనుగుణంగా పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ముగ్గురు డీసీపీలు, 13 మంది ఏసీపీలు, 26 మంది ఇన్స్పెక్టర్లను అదనంగా నగర పోలీసు కమిషనరేట్‌కు ప్రభుత్వం మంజూరు చేసింది. నగరంలో ప్రస్తుతం వెస్ట్‌జోన్, నార్త్‌జోన్, సెంట్రల్ జోన్, ఈస్ట్‌జోన్, సౌత్‌జోన్ ఉండగా, 17 డివిజన్లు, 60 ఠాణాలున్నాయి. తాజాగా ఐదు జోన్లను ఏడు జోన్లుగా విభజిస్తున్నారు. జోన్ల పునర్విభజన అనంతరం నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇక నుంచి 73 ఠాణాలు, 27 డివిజన్లు, 7 జోన్లు ఏర్పడుతాయి. జనవరి 1వ తేదీ నుంచి కొత్త ఠాణాలు, డివిజన్లు, జోన్ల నుంచే విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.