నైరుతి రుతుపవనాల తిరోగమన వేళ వరుణుడి ఆగ్రహంతో నగరం వణికింది..మోస్తరుగా మొదలై కుండపోతగా కురిసిన వానతో జలదిగ్బంధమైంది..రహదారులు, కాలనీల్లో వరద ఉప్పొంగింది. చెరువులు, కుంటల సమీపంలోని లోతట్టు ప్రాంతాలు బిక్కుబిక్కుమన్నాయి. శుక్రవారం రాత్రి రెండుమూడు గంటల్లోనే 13 సెం.మీ వర్షపాతం కురవగా, శనివారం మళ్లీ అంతే స్థాయిలో విరుచుకుపడింది. వరద ప్రాంతాలు తేరుకుంటున్న లోపే కుంభవృష్టితో తిప్పలు తప్పలేదు.
కేవలం గంట వ్యవధిలోనే 9.5 సెం.మీ వర్షం కురిసింది. శుక్రవారం రాత్రి కురిసిన వానకు గడ్డిఅన్నారం శివగంగా థియేటర్లోకి నీళ్లు రాగా, ప్రహరీ కూలీ పలు ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. సరూర్‌నగర్, జిల్లెలగూడ, మీర్‌పేట చెరువు సమీప కాలనీలు నీటమునిగాయి. ఎల్బీనగర్ చింతలకుంటలో గల్లంతయ్యాడనుకున్న యువకుడు క్షేమంగా ఇంటికి చేరుకున్నాడు. చాదర్‌ఘాట్, మూసారాంబాగ్ దిగువ వంతెనలపై మూసీ ప్రవహిస్తుండడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
ఉపరితల ఆవర్తనం బలహీనపడి ద్రోణి రూపంలో నగరం వైపు కదులుతుండడంతో రాగల 36 గంటల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయట తిరగకపోవడమే మేలని సూచించారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే 040-21111111ను సంప్రదించాలని బల్దియా కమిషనర్ కోరారు.
భారీ వర్షాలకు జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, గండిపేటలకు వరద పోటెత్తుతున్నది. దీంతో గండిపేట చెరువు 4 గేట్లు, హిమాయత్‌సాగర్ 6 గేట్లను ఎత్తివేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
వందేండ్ల తర్వాత గతేడాది అక్టోబర్ నెలలో భారీ వర్షం కురవడంతో నగరం అతలాకుతలమైంది. ఏడాది తర్వాత మళ్లీ ఈ మాసంలోనే భారీ వానలు కురుస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కాగా డీఆర్ఎఫ్, జలమండలి ప్రత్యేక బృందాలు ఎప్పటికప్పుడు సహాయక చర్యల్ని చేపడుతున్నాయి.
మధ్యాహ్నం వరకు ఉక్కపోత.. ఆ తర్వాత వాన దంచికొడుతున్నది. ఇలా రెండురోజులుగా గ్రేటర్లో భిన్న వాతావరణం కనిపిస్తున్నది. శుక్రవారం కురిసిన భారీ వర్షానికి అతలాకుతలమైన నగరం.. మళ్లీ శనివారం వరణుడు ఉరుములు, మెరుపులతో విరుచుకుపడటంతో మరోసారి జనజీవనం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతా లు జలమయమయ్యాయి. వాహనాలు కొట్టుకుపోయా యి. మూసారాంబాగ్ వంతెనపై నుంచి మూసీ నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు లోతట్టు ప్రాంతాల్లో బల్దియా సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. కంటిమీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు.
ఉప్పర్‌పల్లి పీవీఎక్స్‌ప్రెస్ ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్ 190 వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరడంతో డీమార్ట్ వరకు సుమారు కిలోమీటర్ పొడవునా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
కోఠి, సుల్తాన్‌బజార్, అబిడ్స్, మోజాంజాహి మార్కెట్, మల్లేపల్లి, పుత్లీబౌలి, బేగంబజార్, సిద్దంబర్ బజార్, గౌలిగూడ చమాన్, ఛాదర్‌ఘాట్ ప్రధాన రహదారుల్లో వర్షం నీరు రోడ్లపై భారీ ఎత్తున ప్రవహించింది. నాంపల్లి బీజేపీ కార్యాలయం నుంచి ఎంజే మార్కెట్ రోడ్ వరకు వరదనీరు వల్ల ద్విచక్ర వాహనదారులు ముందుకు వెళ్లలేకపోయారు. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
పలు చోట్ల కరెంట్ సరఫరాలో అంతరాయం కలిగింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. లక్ష్మీనగర్, శివగంగానగర్‌లో ఇండ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు, ఓ ఆటో ట్రాలీ నీటిలో కొంత దూరం కొట్టుకుపోయాయి.
యూసుఫ్‌గూడ సర్కిల్ ఎర్రగడ్డలో రహదారులు నీట మునిగాయి. బల్దియా సిబ్బంది రంగంలోకి దిగి మ్యాన్హోల్ల నుంచి వరద నీటిని మళ్లించేందుకు శ్రమించారు.
బడంగ్‌పేట నుంచి అల్మాస్గూడ వెళ్లే ప్రధాన రోడ్డు కొట్టుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలుపడ్డారు. అల్మాస్గూడ నుంచి మీర్‌పేట రహదారిదీ ఇదే పరిస్థితి.
సింగరేణికాలనీ, ఖాజాబాగ్ కాలనీ, శంకేశ్వరబజార్, సన్‌షైన్ కాలనీ, సాయిరాంనగర్ కాలనీ, సాయి గంగా కాలనీ తదితర ప్రాంతాలు వరదనీటితో నిండిపోయాయి. మలక్‌పేట బీ బ్లాక్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్లోనీరు రావడంతో ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు.
మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లోని లోతట్టు ప్రాంతాలు జలమయంకావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాటేదాన్ పారిశ్రామిక వాడలోని విద్యుత్ సబ్ స్టేషన్ మరోసారి నీట మునిగింది. నీరు సబ్ స్టేషన్లోకి చేరింది.అప్పా చెరువు ఉప్పొంగుతున్నది.